బీజేపీ కుట్రలను తిప్పికొడదాం.. ‘సర్’తో ఓట్లు పోకుండా అలర్ట్‌‌‌‌గా ఉందాం.. పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం..

బీజేపీ కుట్రలను తిప్పికొడదాం.. ‘సర్’తో ఓట్లు పోకుండా అలర్ట్‌‌‌‌గా ఉందాం.. పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం..
  • ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు
  • అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు దక్కేలా పార్టీ బీఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశం
  • రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మీనాక్షి నేతృత్వంలో ఇందిరా భవన్‌‌‌‌లో భేటీ
  • హాజరైన సీఎం రేవంత్‌‌‌‌, డిప్యూటీ సీఎం భట్టి,  పీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు

న్యూఢిల్లీ, వెలుగు: ‘సర్’ పేరుతో ఓట్లను తొలగించాలనే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని పీసీసీ సమన్వయ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. పూర్తిస్థాయిలో ‘సర్’ ప్రక్రియ ముగిసే వరకు పార్టీ ముఖ్య నేతలతోపాటు డీసీసీలు, మండల స్థాయి నేతలు, ప్రధానంగా బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్ఏ)లు ఎలాంటి పనులు పెట్టుకోవద్దని ఆదేశించింది. 

ప్రతి ఓటు ప్రామాణికంగా తీసుకొని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు దక్కేలా పార్టీ బీఎల్ఏలు బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పీసీసీ సమన్వయ కమిటీ ఏర్పడిన సుమారు 4 నెలల తర్వాత.. తొలిసారి భేటీ అయింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీడబ్ల్యూసీ సభ్యులు మంత్రి దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌‌ పాల్గొన్నారు. 

దాదాపు గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో  ‘సర్’ ప్రక్రియ పై పార్టీ ఫోకస్, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ముందుగా దాదాపు నెల రోజులుగా సాగుతోన్న ఈ ప్రక్రియలో పార్టీ నుంచి లోపాలు, బీఎల్ఏల గైర్హాజరుపై పార్టీ ఇన్‌‌చార్జి, సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘సర్’ విషయంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా.. పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీల తీరు మారకపోవడంపై సీరియస్ అయినట్టు తెలిసింది. 

అలాంటి వారి తీరుపై రివ్యూ జరపడంతోపాటు పార్టీపరంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. అలాగే, మరో నాలుగు రోజుల్లో ‘సర్’ తొలి దశ ప్రక్రియ ముగుస్తోన్న నేపథ్యంలో.. అర్హుడైన ఏ ఒక్క వ్యక్తి ఓటు కోల్పోకుండా పార్టీ బీఎల్ఏలు మరింత సమర్థవంతంగా పని చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో బీఎల్ఏలకు మండల, జిల్లా నేతలతోపాటు ఎమ్మెల్యేలు తోడుగా ఉండాలని కమిటీ ఆదేశించినట్టు తెలిసింది. 

రెండు నెలలకోసారి భేటీ..

పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం చేసుకునే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. ప్రభుత్వం తీసుకునే అభివృద్ధి, సంక్షేమ పథకాలను పార్టీ నేతలతోనూ చర్చించాలని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. తద్వారా పార్టీ శ్రేణులు, 
కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. దీనిపై ఒక యాక్షన్ ప్లాన్‌‌తో ముందుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. 

ఇందులో భాగంగా పీసీసీలోనే కీలకమైన సమన్వయ కమిటీ రెండు నెలలకు ఒకసారి భేటీ అవ్వాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అలాగే, ఖమ్మం–వరంగల్–నల్గొండ, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 

ఓట్లు తొలగించే దురుద్దేశంతో‘సర్’ సాగుతోంది: పీసీసీ చీఫ్

ఈ సారి దేశంలో ఓట్లను తొలగించే దురుద్దేశంతో ‘సర్’ ప్రక్రియ సాగుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందుకే బీజేపీ చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను తిప్పికొట్టే వ్యూహాలపై పీసీసీ సమన్వయ కమిటీలో చర్చించినట్టు చెప్పారు.  

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై రివ్యూ చేసినట్టు తెలిపారు.  పార్టీ నుంచి దాదాపు 36 వేల మంది బూత్ లెవల్ ఏజెంట్లను(బీఎల్ఏ) నియమించినట్టు చెప్పారు. ఇప్పటికే ‘సర్‌‌‌‌’ ప్రక్రియ 50–60 శాతం పూర్తయిందన్నారు. రెండు మూడు రోజుల్లో 100 శాతం పూర్తవుతుందని తెలిపారు. అర్హతగల ఓటర్ల ఓటు హక్కును కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, సంస్థాగత బలోపేతం, పార్టీ ప్రభుత్వ సమన్వయంపై చర్చించినట్టు చెప్పారు. 

ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చేలా యాక్షన్ ప్లాన్: డిప్యూటీ సీఎం భట్టి

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అలాగే, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్‌‌పై చర్చ జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికలపై జిల్లా ఇన్‌‌చార్జి, జిల్లా పీసీసీలతో చర్చించి.. ముగ్గురు సభ్యులతో ప్యానల్ ఏర్పాటు చేసి నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు. 

దేశ పౌరులుగా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలన్నారు. ఈ విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసిన బీఎల్ఏలు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేస్తున్నారని అభినందించారు. మరింత వేగం పెంచాలని సూచించారు.