- చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ను పునర్ వ్యవస్థీకరించినట్లు ఆ సంస్థ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు జిల్లాలు మినహాయిస్తే మిగిలిన 27 జిల్లాలకు కొత్త చైర్మన్లు, కమిటీలను నియమించినట్లు చెప్పారు. రాష్ట్ర కమిటీలో 16 మంది వైస్ చైర్మన్లను, 9 మంది ప్రధాన కార్యదర్శులను, 29 మంది రాష్ట్ర కార్యదర్శులను నియమించినట్లు వివరించారు.
ఇతర కార్యవర్గ సభ్యులను, ఆఫీసు బేరర్లను కూడా నియమించామన్నారు. తెలంగాణలోని ఎస్సీ సమాజాన్ని రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో ఎస్సీలు కీలకం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ కమిటీలో దళితుల్లోని 54 కులాలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.
