మీనాక్షి నటరాజన్ తో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ

మీనాక్షి నటరాజన్ తో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పెద్దపల్లి జిల్లా నేతలతో ఏఐసీసీ  ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ, సర్ (SIR) ప్రక్రియపై నేతలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది.

ఓటర్ల జాబితా వెరిఫికేషన్ లేదా 'సర్' ప్రక్రియపై బూత్ స్థాయి నుంచే గట్టి నిఘా ఉంచాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక శిక్షణ పొందిన డీఓటీ (DOT)లను అన్ని జిల్లాలకు కేటాయించింది. ప్రస్తుతం బూత్ లెవల్ నేతలకు ఈ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. ఈ సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఓట్లను దొంగిలిస్తోందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ ఆదేశాలతోనే.. ఎన్నికల సంఘం సర్ పేరుతో ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.


ఇటీవల పశ్చిమ బెంగాల్‌ లో కూడా ఇదే తరహాలో సర్ పేరుతో భారీగా ఓట్లను తొలగించారని.. అదే పొరపాటు, నష్టం తెలంగాణలో జరగకుండా కాంగ్రెస్ పార్టీ ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఓటును కాపాడుకునేలా, అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో నాయకులు అలర్ట్‌గా ఉండాలని ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.