- గ్రేటర్ పరిధిలో రెన్యూవల్ చేయించుకోని బైకర్లు 28 లక్షలకు పైనే..
- ఇన్సూరెన్స్ రెన్యూవల్‌లో కార్ల యజమానులు బెటర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేయించుకోవడంలో జనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో రవాణా శాఖ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. కొత్త వెహికల్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు కంపెనీ వాళ్లే ఇన్సూరెన్స్ చేయించి వాహనదారులకు అందిస్తున్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి ఆ వెహికల్స్‌కు వాహనదారులు రెన్యూవల్ చేయించుకోవడంలేదు.
గ్రేటర్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 88 లక్షలపైగా వెహికల్స్ ఉండగా, ఇందులో 58 లక్షల వరకు టూ వీలర్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు 28 లక్షలకు పైగా (48 శాతం) టూ వీలర్స్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకోలేదు. గ్రేటర్‌లో సుమారు 18 నుంచి 20 లక్షల కార్లు ఉండగా, అందులో 90 శాతం వరకు ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయించుకుంటున్నట్లు ఆర్టీఏ రికార్డులు చెప్తున్నాయి. ఇన్యూరెన్స్ రెన్యూవల్ లేని టూ వీలర్స్ తనిఖీలో పట్టుబడితే రూ.1,000 ఫైన్, కార్లు పట్టుబడితే రూ.2 వేల ఫైన్ విధిస్తున్నారు. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోకపోవడంతో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులు ఆర్థిక సహాయం పొందలేకపోతున్నారు.
