జన్నారం, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే అరుదైన పక్షి జాతుల్లో ఒకటైన పెరెగ్రిన్ పాల్కన్ మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం రేంజ్ కిష్టాపూర్ చెరువు సమీపంలోని సెల్‌టవర్‌పై శనివారం కనిపించింది. దీనిని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త, వన్యప్రాణి పరిశోధకుడు డాక్టర్ వెంకట్ ఎనగుందుల తన కెమెరాలో బంధించారు.
ఈ పక్షి మాంసాహర జాతికి చెందినదని, బలమైన రెక్కలు, కాళ్లు కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాల్లో కనిపిస్తుందని, గంటకు సుమారు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని వివరించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్, శ్రీలంక, పాకిస్థాన్ దేశాలకు వలస వచ్చి, శీతాకాలం ముగిసిన తర్వాత తిరిగి ఇతర దేశాలకు వెళ్తుందని చెప్పారు. ఐదేళ్ల క్రితం కవ్వాల్ ప్రాంతంలో కనిపించిన ఈ పక్షి మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వడం విశేషమన్నారు.
