- రాజేంద్రనగర్ వర్క్‌షాప్‌లో మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభల సాధికారత, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ‘పీసా’ చట్టం రాజ్యాంగబద్ధమైన కవచమని మంత్రి సీతక్క అన్నారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో పీసా చట్టం అమలుపై నిర్వహిస్తున్న రెండ్రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీసా చట్టం ఆదివాసీల ఆత్మగౌరవమని తెలిపారు. చట్టం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవగాహన లోపం వల్ల ఆదివాసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ సంస్థలు గిరిజనులను నిరాశ్రయులను చేస్తుంటే పీసా చట్టం చూస్తూ ఊరుకోదని, ఆ హక్కుల గురించి అధికారులు, ప్రజలకు పూర్తి అవగాహన ఉండాలని, చట్ట స్ఫూర్తిని అర్థం చేసుకున్నప్పుడే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
బాలికల మాక్ అసెంబ్లీ
హైదరాబాద్‌లోని జూబ్లీహాల్ బుధవారం కిశోర బాలికల వాద, ప్రతివాదలతో హోరెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన టీనేజ్ బాలికలు ఎమ్మెల్యేలు, మంత్రులుగా మారి ప్రజా సమస్యలపై చర్చించారు. తెల్లటి ఖాదీ దుస్తులు, కండువాలు ధరించి అచ్చం రాజకీయ నేతల్లా సభలో గంభీరంగా వ్యవహరించారు. సెర్ప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రాష్ట్రస్థాయి ‘మాక్ అసెంబ్లీ’కి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియా మోజులో పడి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. ఒక రీల్ చూడటం మొదలుపెడితే గంటల తరబడి సమయం ఎలా పోతుందో తెలియదని, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని కోరారు.
