పందుల పెంపకానికి పాలసీ: తలసాని

పందుల పెంపకానికి పాలసీ: తలసాని

సొంత భూమి ఉంటే పిగ్‌ ఫామ్స్‌ పెట్టుకోవచ్చు

రాష్ట్రంలో పందుల పెంపకం కోసం ప్రత్యేక పాలసీని రూపొందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో పందుల పెంపకందారుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో కలసి మంత్రి తలసాని సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 6,750 మంది సభ్యులతో189 ప్రాథమిక పిగ్ బ్రీడర్స్ కో ఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయని తెలిపారు. వీరిలో 5,920 మంది ఎస్టీలే ఉన్నారని చెప్పారు. గ్రామాల్లో సభ్యత్వ నమోదు చేస్తే వృత్తి దారుల సంఖ్యలో మరింత స్పష్టత వస్తుందన్నారు. మండలానికి ఒక పిగ్ బ్రీడర్స్ సొసైటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పౌల్ట్రీ ఫామ్‌ల తరహాలో పందుల పెంపకం చేపట్టే వారికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణాలిస్తామని తెలిపారు. ఒక యూనిట్ కు రూ. లక్ష కేటాయించే పథకం కోసం మార్గదర్శకాలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. దీనిపై పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. పాలసీపై అధ్యయనం చేసేందుకు పెంపకందారులు, అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.  జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పిగ్ మాంసానికి డిమాండ్ ఉందని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే అనేక మందికి ఉపాధి లభిస్తుందని పెంపకందారుల సంఘం నేతలు రాములు, మధుసూదన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో త్వరలో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు

రాష్ట్రంలో త్వరలో రూ.18 కోట్లతో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు ప్రారంభిస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే రూపొందిస్తామని చెప్పారు. సోమవారం పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి  ఈటల రాజేందర్‌తో కలసి మత్స్య శాఖపై తలసాని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మత్స్యకార సొసైటీల్లో రూల్స్ ప్రకారం అర్హత కలిగిన వారికే సభ్యత్వం కల్పిస్తామన్నారు. సభ్యత్వ నమోదుకు నిబంధనలను సులభతరం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నందున మత్స్యసంపద భారీగా పెరిగిందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే 63 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల్లో ఉన్న మత్స్య సంపదపై పూర్తి అధికారాలు మత్స్యశాఖకే వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని గ్రామాలలో మత్స్యసంపద ఉన్నా.. మత్స్యకారులు లేరని అలాంటి సందర్భాల్లో మండలాన్ని యూనిట్ గా తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 6 నెలలు,9 నెలలు, ఏడాది  పొడవునా నీరుండే చెరువులను కేటగిరీలుగా విభజించి చేపపిల్లలను విడుదల చేస్తామని తెలిపారు. రిజర్వాయర్ పరిధిలోని మత్స్యకారులకే లైసెన్సులు ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాల్లో చేపల మార్కెట్ నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు.