పీఎం కిసాన్ సొమ్ము రికవరీ చేయనున్న కేంద్రం

పీఎం కిసాన్ సొమ్ము రికవరీ చేయనున్న కేంద్రం
  • 3 వేల కోట్లు పీఎం కిసాన్ సొమ్ము రికవరీ
  • పార్లమెంట్​లో ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందిన అనర్హుల నుంచి సొమ్ము రికవరీ చేయాలని  కేంద్రం నిర్ణయించింది. అనర్హులైన 42 లక్షల మంది రైతుల నుంచి దాదాపు రూ.3 వేల కోట్ల సొమ్మును వెనక్కి తీసుకుంటామని మంగళవారం పార్లమెంట్​లో స్పష్టం చేసింది. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.6 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వారు ఈ పథకానికి అనర్హులు.. మంగళవారం పార్లమెంట్​లో ఓ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిస్తూ.. అనర్హులైన 42.16 లక్షల మంది రైతుల నుంచి రూ.2,992 కోట్ల సొమ్ము రికవరీ చేయనున్నట్లు తెలిపారు. అనర్హులైన రైతులు ఎక్కువమంది అస్సాంలో 8.35 లక్షలు, తమిళనాడులో 7.22 లక్షలు, పంజాబ్​లో 5.62 లక్షలు, మహారాష్ట్రలో 4.45 లక్షలు, యూపీలో 2.65 లక్షల మంది ఉన్నారు. అస్సాం నుంచే రూ.554 కోట్ల సొమ్మును రికవరీ చేయాలి. ‘పీఎం కిసాన్ నిధులు దుర్వినియోగం కాకుండా, నిజమైన రైతులకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం..’ అని తోమర్ తెలిపారు.