- గతంలో మనతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకొచ్చేవి కావు
- అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకుంటున్నం
- ఈయూతో వాణిజ్య ఒప్పందం ఓ మైలురాయి
- యూఎస్–భారత్ ట్రేడ్ డీల్‌ను ప్రపంచం అభినందిస్తున్నది
- రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో దూసుకెళ్తున్నం
- కాంగ్రెస్‌కు ఊహలే తెలుసు.. పథకాల అమలు తెలియదు
- యూపీఏ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమే
- ఆ పార్టీకి సిక్కులంటే పడదు..
- అందుకే రవ్‌నీత్ సింగ్‌ను రాహుల్ అవమానించాడు
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై
- రాజ్యసభలో ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ (గ్లోబల్ ఆర్డర్) వైపు అడుగులు వేస్తున్నదని, అందులో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎన్డీయే హయాంలోనే ‘గ్లోబల్ సౌత్’ (అభివృద్ధి చెందుతున్న దేశాల) బలమైన గొంతుకగా దేశం అవతరించిందని చెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ ప్రసంగించారు. గతంలో భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ఆసక్తి చూపలేదని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, అవి మన దేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే దీనికి ప్రధాన కారణమని స్పష్టం చేశారు. మన ఆర్థిక శక్తిపై అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరగడం వల్లే అనేక దేశాలు వాణిజ్య ఒప్పందాల కోసం క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు. భారత్ ఇటీవల పలు అగ్రగామి ఆర్థిక వ్యవస్థలతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా భారీ ట్రేడ్ డీల్స్‌ను కుదుర్చుకున్నదని తెలిపారు. గత కొన్ని రోజుల్లోనే 9 ప్రధాన వాణిజ్య ఒప్పందాలను చేసుకుందని వెల్లడించారు. ఇందులో 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో జరిగిన ఒప్పందం ఓ మైలురాయి అని పేర్కొన్నారు.
భారత్–-అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్‌ను ప్రపంచమంతా అభినందిస్తున్నదని, ఇది దేశ యువతకు ఉపాధి పరంగా ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. భారత్‌కు మరింత బలం పెరుగుతుందన్నారు. గత పాలకుల హయాంలో దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి దేశాలు ఎందుకు ముందుకు రాలేదో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని ప్రధాని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో ప్రపంచంలోనే భారత్11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే.. ఎన్డీయే హయాంలో మూడో స్థానానికి చేరుకోబోతున్నదని చెప్పారు. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదన్నారు.
నాడు ఒప్పందాలంటే బోఫోర్స్..
నాడు కాంగ్రెస్ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమేనని, కానీ నేడు దేశ ప్రయోజనాల కోసం ఒప్పందాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. 2014కు ముందు దేశం అస్తవ్యస్తంగా ఉండేదని, ప్రపంచ దేశాల్లో భారత్ పట్ల ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చడానికి తాను ఎంతో శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఊహలు మాత్రమే ఉంటాయని, పథకాల అమలు గురించి వారికి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. దేశంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్, తృణమూల్, లెఫ్ట్, డీఎంకేలాంటి పార్టీలు దశాబ్దాల కాలం పాలించినా, వారి పేరు వినగానే ‘అవినీతి’ గుర్తొస్తుందని విమర్శించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అమెరికాతో జరిగిన ఒప్పందం వల్ల భారతీయ రైతులు, పాడి పరిశ్రమ దెబ్బతింటుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. వ్యవసాయం, డెయిరీలాంటి కీలక రంగాలు ఈ ఒప్పందంలో సురక్షితంగా ఉన్నాయని, భారత ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సిక్కులంటే మొదటి నుంచీ ద్వేషమని, ఆ సమాజాన్ని అవమానించడమే ఆ పార్టీ పని అని మోదీ మండిపడ్డారు. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన ‘ద్రోహి’ అనే వ్యాఖ్యలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి బిట్టు మధ్య జరిగిన వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ.. రాహుల్ ప్రవర్తన ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ఒక ఎంపీని 'ద్రోహి' అని పిలవడం దేశ పౌరులను అవమానించడమేనని మండిపడ్డారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఆయన రాజకీయ భావజాలం మార్చుకున్నంత మాత్రాన ద్రోహి అయిపోతారా? అని ప్రశ్నించారు. ఇలాంటి తీరువల్లనే కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్నదని అన్నారు.
అక్రమ వలసదారుల రక్షణ కోసం కోర్టుకెళ్తున్నారు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై ప్రధాని మోదీ స్పందించారు. కొంతమంది అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకు కోర్టులకు వెళ్తున్నారని టీఎంసీ సర్కారుపై మండిపడ్డారు. అక్రమ వలసదారులు దేశ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను, అవకాశాలను లాక్కుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ప్రపంచంలోని సంపన్న దేశాలే అక్రమ వలసదారులను వెళ్లగొడుతుంటే, మన దేశంలో మాత్రం కొందరు వారి కోసం బాహాటంగా వాదిస్తున్నారు. ఇలాంటి నేతలను దేశ యువత ఎలా అంగీకరిస్తుంది?’’ అని ప్రశ్నించారు. తృణమూల్ కాంగ్రెస్‌కు అధికారంపై ఉన్న వ్యామోహం ప్రజల భద్రత కంటే ముఖ్యం కాదని విమర్శించారు. దేశ భద్రత, యువత ఉపాధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చొరబాటుదారుల పట్ల కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల వాకౌట్...మోదీ వ్యంగ్యాస్త్రాలు
రాజ్యసభలో విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు. ప్రతిపక్ష సభ్యులతోపాటు ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (83)పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఖర్గే కూడా నిలబడి నిరసన వ్యక్తం చేయడాన్ని గమనించిన ప్రధాని.. ‘‘ఖర్గే వయస్సును పరిగణనలోకి తీసుకొని, ఆయనకు కూర్చునే నినాదాలు చేసే వెసులుబాటు కల్పించండి” అని స్పీకర్‌ను కోరారు. ఖర్గే వయస్సు దృష్ట్యా ఆయనకు ఎలాంటి శారీరక అసౌకర్యం కలగకూడదనే ఈ విన్నపం చేస్తున్నట్టు చురకలంటించారు. కాగా, ప్రధాని ప్రసంగం కొనసాగుతుండగానే ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నదని, కీలక అంశాలపై చర్చకు అనుమతించడం లేదని వారు ఆరోపించారు. ‘ప్రతిపక్ష నేతకు మాట్లాడే చాన్స్ ఇవ్వండి’ అంటూ నినదిస్తూ బయటికివెళ్లిపోయారు. వారు వెళ్లిపోగానే ప్రధాని స్పందిస్తూ.‘వారు అలసిపోయారు, అందుకే పారిపోయారు’’ అంటూ ఎద్దేవా చేశారు.
యువశక్తి మన బలం..
మాన్యుఫాక్చరింగ్ రంగంలో బలమైన ఎకో సిస్టమ్ వల్లే ఒప్పందాలు వస్తున్నాయని మోదీ తెలిపారు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే నినాదంతో దేశం దూసుకెళ్తున్నదని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో పోటీకి భారత్ రెడీగా ఉన్నదని తెలిపారు. వృద్ధుల సంఖ్య పెరిగి ప్రపంచంలోని అనేక దేశాలు ఆందోళన చెందుతుండగా.. మనదగ్గర యువత జనాభా అధికంగా ఉన్నదని తెలిపారు. యువశక్తే మన బలమని, మన యూత్‌ను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయ ని చెప్పారు. ముద్ర యోజన పథకం ద్వారా అనేక మంది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందుతున్నారని వెల్లడించారు. 10 కోట్ల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు లబ్ధి పొందారని వివరించారు.
