- డీజీపీ శివధర్‌రెడ్డి
- అరైవ్, అలైవ్ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేయాలని పిలుపు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం నిర్మల్ కు చేరుకోగా, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ కార్యక్రమాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో పాల్గొంటున్న సిబ్బందితో మాటామంతీ నిర్వహించారు. కార్యక్రమం అమలు తీరు, ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అరైవ్ అలైవ్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
భరోసా సెంటర్ ను ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ అక్క కార్యక్రమం, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు పూర్తి భద్రతతో పాటు కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ఈ ప్రోగ్రామ్‌కు జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు రావడం పోలీస్ శాఖకు గర్వకారణమని తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా, వెంటనే స్పందించేలా పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ శాఖలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సాంకేతికను వినియోగిస్తూ ప్రజలకు సేవలు చేరువ చేశామన్నారు. సైబర్ క్రైమ్ పై దృష్టి సారిస్తున్నామని, నేరాల శాతం గణనీయంగా తగ్గించామన్నారు. అడిషనల్ ఎస్పీలు ఉపేందర్ రెడ్డి, సాయి కిరణ్ పాల్గొన్నారు.
కామారెడ్డి: అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఉద్యమంగా స్వీకరించాలని డీజీపీ శివధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని కళాభారతిలో రహదారి భద్రతపై నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. అంతకుముందు సదాశివనగర్ మండలం కుప్రియాల్ సమీపంలో హైవేపై బ్లాక్‌స్పాట్‌ను పరిశీలించారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. యాక్సిడెంట్‌లు తీవ్రమైన సమస్యగా మారుతున్న తరుణంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్, వెహికిల్స్‌లో డ్రైవర్‌తో పాటు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ప్రాణాలు దక్కుతాయని చెప్పారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, లైబ్రరీ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసిహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదాల్లో పలువురిని కాపాడిన వంకాయల రవిని డీజీపీ సన్మానించారు.
జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి
నిజామాబాద్: వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ స్వీయ రక్షణ ఆలోచనతో డ్రైవింగ్ చేయాలని డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద హైవే విజిట్ చేపట్టారు. స్పీడ్‌గా వాహనం నడిపి ప్రమాదాలు తెచ్చుకోవద్దని, ఎదుట ఉన్న వాహనానికి తగిన దూరంపాటించి వెహికల్ నడపాలన్నారు. బైక్‌పై వెళ్లే ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం పౌరులతో ప్రతిజ్ఞ చేయించారు. సీపీ సాయిచైతన్య, అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజావెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ వినోద్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఉన్నారు.

