నిర్మాత నట్టికుమార్ కొడుకుపై పోలీసుల దాడి

నిర్మాత నట్టికుమార్ కొడుకుపై పోలీసుల దాడి

బేగంపేట కంట్రీ క్లబ్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. సినీ నిర్మాత నట్టి కుమార్ కొడుకు క్రాంతిపై పోలీసులు దాడి చేశారు. బ్యూటిఫుల్ సినిమాకు ప్రమోషన్ కల్పిస్తామని కంట్రీ క్లబ్ ఈవెంట్ మేనేజర్ సుమన్.. సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు.. ఆ సినిమా టీం అందరిని డిసెంబర్ 31 నైట్ ఈవెంట్‌కు రావాలని కోరాడు. దాంతో సినిమా టీం అంతా క్లబ్‌కు చేరుకున్నారు. అయితే కంట్రీ క్లబ్ మేనేజర్ సుమన్ తమను లోపలికి రాకుండా అడ్డుకున్నారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈవెంట్‌కు రమ్మని ఇప్పుడు లోపలికి ఎందుకు పంపించరు అని క్రాంతి, క్లబ్ సిబ్బందితో వాదనకు దిగాడు. ఆ తర్వాత క్రాంతి కారు కనబడకపోయేసరికి 100కి ఫోన్ చేసి చెప్పాడు. అక్కడికి వచ్చిన పోలీసులు.. కారు కనబడకపోతే మాకు ఫోన్ చేస్తావా అంటూ క్రాంతిపై దాడికి దిగారు. తర్వాత క్రాంతిని పంజాగుట్టా పోలీస్‌స్టేషన్‌కి తీసుకువెళ్లారు. విషయం తెలిసిన నట్టికుమార్, హుటాహుటిన స్టేషన్‌కు వెళ్లి.. పోలీసులతో మాట్లాడి తన కొడుకు క్రాంతిని ఇంటికి తీసుకువెళ్లారు. క్రాంతిపై దురుసుగా ప్రవర్తించినందుకు పోలీసులు క్షమాపణ చెప్పారని నిర్మాత నట్టికుమార్ తెలిపారు. ఈవెంట్ మేనేజర్ సుమన్, తమ సినిమాను ప్రమోట్ చేస్తానని చెప్పి మోసం చేశాడని నట్టికుమార్ ఆరోపించారు. గొడవ జరగడంతో రాంగోపాల్ వర్మ కూడా తన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నారని నట్టికుమార్ తెలిపారు. తమను మోసం చేసిన సుమన్‌ను వెంటనే అరెస్టు చేయాలని నట్టికుమార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.