పాత రూ.500 నోటుకు 50 వేలు వస్తాయని..

పాత రూ.500 నోటుకు 50 వేలు వస్తాయని..
  •     పెట్రోల్ బంక్ యజమానికి టోపీ
  •     48 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు‘‘మాకు తెలిసిన పార్టీ దగ్గర 2002 సిరీస్​కు చెందిన రూ.500 నోట్లు పాతవి ఉన్నాయి. వాటికి మార్కెట్​లో గిరాకీ ఎక్కువ. ఒక్కోదానికి రూ.50 వేలు ఇస్తారు” అంటూ ఓ పెట్రోల్ బంక్ యజమానికి టోపీ పెట్టారు కేటుగాళ్లు. రూ.12 లక్షలు కొట్టేసి ఉడాయించారు. కేసును చాలెంజింగ్​గా తీసుకున్న పోలీసులు నిందితులను 48 గంటల్లో పట్టుకున్నారు. డబ్బును రికవరీ చేశారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శుక్రవారం వెల్లడించారు.

వందల కోట్లు సంపాదించొచ్చని..

హైదరాబాద్​చాంద్రాయణ్ గుట్టలోని నబీల్ కాలనీకి చెందిన అబీద్ మొహియుద్దీన్ (35), తలాబ్ కట్టకు చెందిన షేక్ అబ్దుల్ బాసిత్ (34).. మెటల్, వాటర్ బాటిల్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి పుత్లీబౌలిలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న రాజేశ్ (28) అనే వ్యక్తితో ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముగ్గురూ కలిసి పాత నోట్ల పేరుతో మోసానికి స్కెచ్ వేశారు. పెట్రోల్ బంక్ యజమాని రాజ్ కుమార్ బగాడియాను ట్రాప్ చేశారు. అబీద్, బాసిత్ ను రాజ్ కుమార్ కు రాజేశ్ పరిచయం చేశాడు. ‘2002 సిరీస్’కు చెందిన పాత నోట్లకు మార్కెట్​లో డిమాండ్ ఉందని రాజ్ కుమార్​ను వారిద్దరూ నమ్మించారు. ఒక్కో రూ.500 నోటుకి రూ.50 వేలు ఇచ్చేందుకు కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయని చెప్పారు. 2002 సిరీస్ నోట్లు కొనుగోలు చేస్తే పెద్ద మొత్తంలో లాభం ఉంటుందని నమ్మించారు. తమకు తెలిసిన ఓ పార్టీ దగ్గర రూ.2 కోట్ల విలువైన ఓల్డ్ కరెన్సీ ఉందని రాజ్ కుమార్ తో చెప్పారు. వాటిని రూ.12 లక్షలకు అమ్మేందుకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. రూ.రెండు కోట్ల పాత నోట్లతో ఒక్కో 500 నోటుకి రూ.50 వేల చొప్పున వందల కోట్లు సంపాదించవచ్చని నమ్మించారు. పాత నోట్లను మార్కెట్ చేసేందుకు తమకు తెలిసిన పార్టీలు ఉన్నాయని చెప్పారు.

48 గంటల్లో చిక్కారు

డబ్బులు తీసుకుని వెళ్లిన అబీద్ నుంచి కానీ బాసిత్ నుంచి కానీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో తను మోసపోయానని రాజ్ కుమార్ గ్రహించాడు. దీంతో ఈనెల 20న సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. రాజేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. రాజేశ్ ఇచ్చిన సమాచారంతోపాటు మొబైల్ నంబర్స్ ఆధారంగా అబీద్, బాసిత్ లను శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద రూ.12ల క్షల నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కి
తరలించారు.

ఇలా దోచేశారు 

పాతనోట్ల దందా గురించి అబీద్, బాసిత్, రాజేశ్ చెప్పిన మాటలు విని రాజ్ కుమార్ రూ.12 లక్షలు సిద్ధం చేసుకున్నారు. ఈనెల 18న సైదాబాద్ కు రూ.12 లక్షలు తీసుకుని బాసిత్ తో కలిసి రాజ్ కుమార్ వెళ్లాడు. ఎస్​బీఐ కాలనీ పార్క్ లో రాజ్ కుమార్ ను అబీద్ కలిశాడు. రూ.2 కోట్ల పాత కరెన్సీ ఇస్తానని చెప్పిన పార్టీ ఇంటికి తాళం వేసి ఉందని రాజ్ కుమార్ కు చెప్పాడు. పోలీసులకు తెలియకుండా జరుగుతున్న ఈ దందాలో తమను మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తారని చెప్పాడు. రాజ్ కుమార్ కు అనుమానం రాకుండా బాసిత్ ను అక్కడే ఉంచి రూ.12 లక్షలతో అబీద్ ఎస్కేప్ అయ్యాడు. తర్వాత బాసిత్ కూడా జారుకున్నాడు. మరుసటి రోజు బాసిత్, అబీద్ కలిసి వాటాలు పంచుకున్నారు. ఇందులో రూ.7 లక్షలు అబీద్ తీసుకుని రూ.5 లక్షలు బాసిత్ కి ఇచ్చాడు.