మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?

మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఎందుకు తప్పుకుంటానంటోంది..కారణం ఇదేనా?
  • మెట్రోXమేడిగడ్డ
  • ఎల్ అండ్ టీ పీటముడి?
  • ఫ్రీ బస్ జర్నీని సాకుగా చూపి బ్లాక్ మెయిల్
  • తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి
  • మెట్రోను వేరే సంస్థకు ఇచ్చేందుకూ రెడీ
  • కాళేశ్వరంపై విచారణ స్టార్ట్ చేయడంతో కొత్త ఎత్తులు

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో నిర్వహణపై ఎల్ అండ్ టీ కంపెనీ బ్లాక్ మెయిల్ కు దిగుతోందని తెలుస్తోంది. ఉచిత బస్సు కారణంగా మెట్రో రైల్ సర్వీసులకు నష్టం వస్తోందని దీనిని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. ఇటీవల ఓ బిజినెస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ అండ్ టీ సీఎఫ్ వో ఆర్ శంకర్ రామన్ కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బిజినెస్ ప్లాన్ లో భాగంగా మెట్రో వాటాలను అమ్మేయనున్నట్టు సీఎఫ్ వో చెప్పారు. రోజుకు ఐదు లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో మెట్రో నిర్వహణ భారంగా మారిందని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. వాస్తవాలను పరిశీలిస్తే ఫ్రీ బస్ తర్వాత కేవలం రోజుకు 20 వేల మంది ప్రయాణికులు మాత్రమే తగ్గారు. ఇది పెద్ద సమస్య కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. 

సీఎం సీరియస్

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామనే సాకుతో మెట్రో నిర్వహణను వదులుకుంటామంటే వేరొకరికి అప్పగిస్తామని సీఎం  రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉచిత బస్సు సౌకర్యం విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతున్నారు. వాస్తవానికి మెట్రో సర్వీసుల్లో నిలుచునేందుకు కూడా జాగా ఉండటం లేదన్నది అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందిన ఎల్ అండ్ టీ సంస్థ ఇప్పుడు మెట్రో నిర్వహణ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మేడిగడ్డ ఎఫెక్టే కారణమా?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. పనులు  పూర్తి కాకున్న అయినట్టు సర్కారు నుంచి సర్టిఫికెట్లు తీసుకొని బిల్లులు పొందిందనే ఆరోపణ ఉంది. అంతలోనే మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం.. అది కాస్తా జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. తొలుత మరమ్మతులు చేస్తామని చెప్పిన ఎల్ అండ్ సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చింది. దీంతో  ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థపై చర్యలకు సిద్ధమైంది. ఇదే తరుణంలో కాళేశ్వరం నిర్మాణంపై రిటైర్డ్ జడ్జితో విచారణ ప్రారంభించింది. అలెర్టయిన ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో వివాదాన్ని ముందుకు తెచ్చిందనే విమర్శలు న్నాయి.