నిజామాబాద్ జీజీహెచ్ లో కిడ్నాప్ అయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు...

నిజామాబాద్ జీజీహెచ్ లో కిడ్నాప్ అయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు...
  • నిజామాబాద్ జీజీహెచ్ నుంచి బాలుడిని ఎత్తుకెళ్లిన దంపతులు
  • సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్​లో గుర్తింపు
  • నిందితులను అదుపులోకి తీసుకొని, బాలుడిని రక్షించిన పోలీసులు

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​జీజీహెచ్​లో కిడ్నాప్ కు గురైన బాలుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు 24 గంటల్లోనే కిడ్నాపర్లను గుర్తించి, బాలుడిని రక్షించారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సాయిచైతన్య ఆదివారం మీడియాకు వెల్లడించారు. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన కోతాడి సుజాత, యెల్లం భార్యాభర్తలు. వీరు చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి అమ్మేస్తూ ఉంటారు. 

ఈ క్రమంలోనే శనివారం నిజామాబాద్ జీజీహెచ్​లోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచ్చారు. యెల్లం బయట వేచి ఉండగా సుజాత హాస్పిటల్ లోకి వెళ్లింది. ఆస్పత్రిలో ఉన్న తమ తల్లిని చూసేందుకు వచ్చిన రెండున్నరేండ్ల దేవాన్ష్, అతడి అన్న నివాన్ష్​సుజాత కంట పడ్డారు. చిన్నారుతలో మాటలు కలిపిన సుజాత చాక్లెట్​కొనిస్తానని వారిని బయటకు తీసుకెళ్లింది. అనంతరం దేవాన్ష్​ను ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

కొద్దిసేపటి తర్వాత బాలుడు కనిపించకపోవడంతో అతడి తండ్రి నరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీఎస్​తో పాటు ప్రత్యేక పోలీస్​టీంలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. జీజీహెచ్​లోని సీసీ కెమెరాల్లో దొరికిన నిందితుల ఫొటోలతో విచారణ మొదలుపెట్టగా.. నిందితులు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్​లో ఉన్నట్లు గుర్తించారు. 

ఆదివారం ఉదయం పోలీసులు దౌల్తాబాద్ కు చేరుకొని యెల్లం, సుజాతను అదుపులోకి తీసుకొని బాలుడిని అతడి తండ్రికి అప్పగించారు. నిందితులపై గతంలో సైతం కిడ్నాప్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.