- వారు చేస్తే అభివృద్ధి.. మేం చేస్తే కాదన్నట్లు మాట్లాడుతున్నడు
- అధికారంలోకి వస్తామని కలలు కనకండి.. మళ్లీ వచ్చేది మేమే
- ఫ్యూచర్ సిటీని ఆపాలని చూస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. “బీఆర్‌ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు, మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా. మీ పొలిటికల్ ఫ్యూచర్ ఖతం చెయ్యాలి అని మీ మామా మీ బామ్మర్ది చూస్తున్నరు.
ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయి మీ ఫ్యూచర్ కాపాడుకో.. బీఆర్ఎస్‌కు ఫ్యూచర్ లేదు.. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు” అని శనివారం మంత్రి పొంగులేటి ‘ఎక్స్’లో పేర్కొన్నారు. హరీశ్‌కు అధికారం పోయిందనే ఫ్రస్టేషన్ తప్ప మరోటి ఉండదు.. వాళ్లు చేస్తనే అభివృద్ధి అన్నట్లు పక్కవాళ్లు చేస్తే కాదన్నట్లు మాట్లాడుతున్నరని ఫైర్ అయ్యారు. హరీశ్ రావు అవినీతిపరుడంటూ సొంత మరదలు రోజూ ఆయనపై దుమ్మెత్తి పోస్తుందని, తాను ఎలాంటి అవినీతి చేయలేదని ఒక్కనాడన్నా ఆయన చెప్పాడా అని ప్రశ్నించారు.
అన్నింటికి అడ్డుపడుతున్నరు..
గత పదేండ్లలో హైదరాబాద్‌లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తోందంటే మీకు అసూయ కలగక తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడపడితే అక్కడ ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, కానీ మేము రాష్ట్రం కోసం, దేశం కోసం ఫ్యూచర్ సిటీ కడ్తుంటే.. ఆపుతాం అంటున్నారని మండిపడ్డారు. “మూసీని బాగుచేస్తామంటే అడ్డుపడుతున్నరు.. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్ర చేశారు.. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నరు.
మళ్లీ అధికారంలోకి వస్తామంటూ హరీశ్ రావు పగటి కలలుకంటున్నడు. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దేశం గర్వించేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుంది. ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఆపే ఆలోచన చేస్తే హరీశ్‌కి ఫ్యూచర్ ఉండదు. ఆయన రాజకీయ జీవితం ప్రజలే చూసుకుంటారు” అని పొంగులేటి హెచ్చరించారు.
