V6 News

ఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్

ఎన్నికల తర్వాత ప్రజలపై పెట్రోల్ బాంబు: లీటరు రూ.120 దాటుతుందా? కోటక్ సంచన రిపోర్ట్

ఈ నెల ఆఖరి నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ముగింపునకు రాబోతున్నాయి. దీంతో ఇప్పుడు సామాన్యుడి జేబుకు కేంద్ర ప్రభుత్వం మంట పెట్టబోతోందనే వార్తలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఆర్థికంగా. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 29తో ముగియనుంది. ఆ మరుసటి క్షణమే మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవచ్చని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తన రిపోర్టులో పేర్కొంది.

భారీ పెంపు తప్పదా?
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 104 డాలర్లకు చేరుకుంది. దీని కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెంచాల్సి ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.94–96 మధ్య ఉండగా.. ఈ పెంపు అమలైతే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.120 మార్కును దాటిపోతాయని చెబుతోంది. ఇక డీజిల్ రేట్లను కూడా కేంద్రం భారీగానే పెంచుతుందని చెప్పింది. 

కోట్లలో నష్టాలు..
ఇక్కడ ఆందోళనకరమైన విషయం ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల నష్టాలు. ప్రస్తుతం చమురు కంపెనీలు ప్రతి నెలా అక్షరాలా రూ.27వేల కోట్లు నష్టపోతున్నాయి. అంటే రోజుకు సుమారు రూ.900 కోట్లు అనమాట. ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 తగ్గించినా, విండ్‌ఫాల్ ట్యాక్స్‌లు వేసినా.. ఈ భారీ నష్టాలను సర్థుబాటు చేసుకునేందుకు ఏమాత్రం సరిపోవటం లేదట.

ఎందుకీ సంక్షోభం?
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ క్రూడ్ సరఫరాను దెబ్బతీశాయి. భారత్ తన ఆయిల్ దిగుమతులను 13-15 శాతం తగ్గించుకున్నప్పటికీ, పెరిగిన ధరల వల్ల ప్రతిరోజూ అదనంగా రూ.1,600 కోట్ల నుంచి రూ. 1,750 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలింది.

సామాన్యుడిపై ప్రభావం..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లుగా కాకుండా.. ఎన్నికలు ముగిసిన తర్వాత విడతల వారీగా ఉండొచ్చని కోటక్ పేర్కొంది. అయినప్పటికీ పెట్రోల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పప్పులు, కూరగాయల ధరలు భగ్గుమంటాయి. డెలివరీ ఛార్జీల నుంచి ఆటో సెంటర్ డిమాండ్ వరకు అన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంది. మే నెలలో భారతీయుల పర్స్ ఖాళీ అవ్వడం ఖాయమని లెక్కలు హెచ్చరిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ ఆయిల్ బాంబు నుంచి ప్రజలను ఎలా కాపాడుతుందో చూడాలి మరి.