హైదరాబాద్, వెలుగు: హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో అక్రమ నిర్మాణాల పేరిట తమ టవర్లపై హైడ్రాతోపాటు ప్రభుత్వ సంస్థలు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ప్రదీప్ కన్స్ట్రక్షన్స్విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డు సర్వే నం.22లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనం.. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నందున చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ ఈనెల 7న జీహెచ్‌ఎంసీ ఇచ్చిన షోకాజ్ నోటీస్‌ను సవాల్ చేస్తూ ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ తరఫున ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
2018, 2020లో సవరించిన నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకున్నాకే నిర్మాణాలు పూర్తిచేశామన్నారు. మూడో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటూ అనుమతులను ఉపసంహరించుకుంటామనడం సరికాదన్నారు. హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ నిర్ధారణకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా వెలువరించలేదన్నారు.
కేవలం డ్రాఫ్ట్ మ్యాప్ ఆధారంగా ఈ నిర్ణయానికి రావడం సరికాదన్నారు. కాగా, ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ నుంచి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తప్పుకుంటూ మరో బెంచ్ ముందుంచాలంటూ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.
