కృష్ణా జలాల పరిరక్షణ కోసం యాత్ర

కృష్ణా జలాల పరిరక్షణ కోసం యాత్ర

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రగతిభవన్ కేంద్రంగా దళారుల దందా కొనసాగుతోందని, దళారులు అధిక కమీషన్లు తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు చేయిస్తున్నారని టీజేఎస్​ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. అందుకే ప్రాజెక్టుల నిర్మాణ ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. రాజకీయ నాయకులు, దళారులు కమీషన్లు అధికంగా తీసుకోవడం వల్ల నిజాయితీ గల కాంట్రాక్టర్లు నష్టపోతున్నారన్నారు. ఈ దళారులను నిలువరించాలని, లేదంటే సీఎం కార్యాలయమే అవినీతిని ప్రోత్సహిస్తోందని భావించాల్సి వస్తుందన్నారు. శనివారం హైదరాబాద్​ లోని టీజేఎస్​ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. 

రైతులను పట్టించుకోకపోవడం దారుణం

కృష్ణా నదీ జలాల పరిరక్షణ కోసం వచ్చే నెల 4 నుంచి యాత్ర చేపడతామని కోదండరాం ప్రకటించారు. నల్గొండ జిల్లా ఉదయ సముద్రం నుంచి నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని బ్రమ్మన వెళ్లెముల ప్రాజెక్టు, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చర్ల గూడెం ప్రాజెక్టు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని ఎస్​ఎల్బీసీ టన్నెల్, నక్కల గండి ప్రాజెక్టు వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. కేఆర్ఎంబీ గెజిట్ ను వెంటనే రద్దు చేయాలని, కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. అలాగే గోదావరి జలాల సాధన యాత్ర కామారెడ్డి జిల్లాలో కొనసాగుతుందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో నిమ్జ్​ పేరుతో భూములు గుంజుకొన్న ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని, ఇది దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. 

25, 26 తేదీల్లో నిరసనలు

కేసీఆర్​ ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తామని ప్రకటించి నెల దాటినా నోటిఫికేషన్లు వేయకపోవడం సిగ్గుచేటని కోదండరాం అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యుల బతుకు భారమవుతోందని వెంటనే ధరలను నియంత్రించాలని, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లులు, బస్ చార్జీల పెంపును నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నెల 25, 26 తేదీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో టీజెఎస్​ ఉపాధ్యక్షుడు పీఎల్​ విశ్వేశ్వర్ రావ్, గంగపురం వెంకట్ రెడ్డి, రాజా మల్లయ్య, ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మజున్, బైరి రమేష్, గోపాగాని శంకర్రావు, నిజ్జన రమేష్, మొగుడంపల్లి ఆశప్ప, అధికార ప్రతినిధులు పల్లె వినయ్ కుమార్, డోలి సత్యనారాయణ, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మరబోయిన శ్రీధర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.