పుట్టిన గడ్డపైనే నా ఓటు తీసేశారు..గేమ్ మొదలైందంటూ ప్రకాశ్ రాజ్  వీడియో

పుట్టిన గడ్డపైనే నా ఓటు తీసేశారు..గేమ్ మొదలైందంటూ ప్రకాశ్ రాజ్  వీడియో

కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ విధానాలపై నిత్యం నిప్పులు చెరిగే ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కర్ణాటకలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా... బెంగళూరు నియోజకవర్గంలో ఓటు హక్కు కోల్పోయిన లక్షలాది మందిలో తాను కూడా ఒకడినంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.  

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన ఒక వీడియోలో ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, నాటకరంగం నడిపాను, చివరకు ఇదే స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాను.  అలాంటిది బెంగళూరులో ఓటు హక్కు కోల్పోయిన 65 లక్షల మందిలో నా పేరు కూడా ఉండటం నిజంగా ఒక మంచి జోక్  అంటూ సెటైర్ వేశారు. తన ఓటర్ ఐడీని తిరిగి పొందడానికి ఇంకెన్ని కాగితాలు చూపించాల్సి వస్తుందో చూస్తానని, గేమ్ ఇప్పుడే మొదలైందని ఆయన సవాలు విసిరారు. ప్రభుత్వాలు తమ అధికారంతో ఓటర్ల హక్కులను తాత్కాలికంగా అణగద్రొక్కగలవేమో కానీ, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను మాత్రం ఆపలేవంటూ హెచ్చరించారు.  

►ALSO READ | Krishneswara Rao: ‘చందమామ కథలు’ నటుడు కన్నుమూత.. ఈ సూపర్ హిట్ చిత్రాలకు కథ రాసింది ఇతనే

ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ చుట్టూ గత కొంతకాలంగా ఓటర్ ఐడీల వివాదం కూడా నడుస్తోంది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో వేర్వేరుగా నాలుగు ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఇటీవల బెంగళూరు నగర కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం, ఆ తర్వాత ఆయన షరతులతో కూడిన బెయిల్ పొందడం తెలిసిందే.