బీజేపీకి కటీఫ్ చెప్పాక ఆ పదవెందుకు.. నితీశ్ కు పీకే ప్రశ్న

బీజేపీకి కటీఫ్ చెప్పాక ఆ పదవెందుకు.. నితీశ్ కు పీకే ప్రశ్న

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య గతకొంతకాలంగా మాటల యుద్దం నడుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నితీశ్‌ కుమార్‌కు బీజేపీతో ఇంకా సంబంధాలు ఉన్నాయంటూ ప్రశాంత్‌ కిషోర్‌ ఇటీవల ఆరోపించగా, పబ్లిసిటీ కోసం ప్రశాంత్‌ కిషోర్‌ చాలా మాట్లాడతాడంటూ నితీశ్‌ ఎద్దేవా చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ నితీశ్‌ ను టార్గెట్ చేస్తూ ప్రశాంత్‌ కిషోర్‌ ఓ ట్వీట్ చేశారు. 

నిజంగా నితీశ్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఉంటే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఇంకా ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. మీరు నిజంగా బీజేపీని వదిలేసి ఉంటే.. ఆ పదవికి హరివంశ్‌తో రాజీనామా చేయించాలన్నారు. రాజీనామాకు హరివంశ్‌ ఒప్పుకోకపోతే చర్యలు తీసుకోవాలని ప్రశాంత్‌ కిషోర్‌ ట్విట్టర్ వేదికగా నితీశ్ కు సూచించారు. ఎప్పుడూ రెండు పడవల్లో ప్రయాణం చేయొద్దని నితీశ్ కు ప్రశాంత్‌ కిషోర్‌ సలహా ఇచ్చారు. 

ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న నితీష్..ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి బీహార్ లో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 21 నాటికి నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టి 17 సంవత్సరాలు అయ్యింది. ఇందులో14 ఏళ్లు బీజేపీతోనే ఆయన ప్రభుత్వాన్నినడిపారు.