V6 News

వేల కోట్లు సంపాదించినా తినేది రెండు రొట్టెలే : రాష్ట్రపతి ముర్ము

వేల కోట్లు సంపాదించినా తినేది రెండు రొట్టెలే : రాష్ట్రపతి ముర్ము
  • ఏ స్థితిలో ఉన్నా.. ఏం చేస్తున్నా ఆత్మసంతృప్తి ముఖ్యం
  • కూడు, గూడు, గుడ్డతోపాటు విద్య కూడా అవసరమే
  • విలువలతో కూడిన చదువు.. ఇంటి నుంచే మొదలవ్వాలి
  • అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు..
  • కేశవ్ మెమోరియల్ కాలేజీ విద్యార్థులతో ప్రెసిడెంట్ ఇంటరాక్షన్

హైదరాబాద్, వెలుగు: ‘‘కోటి, పది కోట్లు, వంద కోట్లు, వెయ్యి కోట్లు.. ఎన్ని కోట్లు సంపాదించినా తినేది రెండు రొట్టెలే.. సేదతీరేది ఆరడుగుల జాగాలోనే’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మంగళవారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పాల్గొన్నారు. హైదరాబాద్ లిబరేషన్‌‌ ఫొటో ఎగ్జిబిషన్‌‌ను చూశారు. తర్వాత విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన  ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ‘‘అనారోగ్యకరమైన పోటీ వల్ల దేశం ముందుకుపోలేదు. మనం బతికేందుకు రోటీ, కపడా, మకాన్​(తిండి, బట్ట, గూడు)తో పాటు విద్య కూడా అవసరమే. కానీ ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకో ఇల్లు కావాలనే స్థాయికి మనం వెళ్లాం. చివరికి విదేశాల్లో కూడా కావాలని కోరుకుంటున్నాం” అని చెప్పారు. తోటి విద్యార్థులు, స్నేహితులు, కుటుంబసభ్యులతోనే పోటీ పడుతున్నారని, పొందిన దానితో సంతృప్తి పడాలని అన్నారు. ఏ స్థితిలో ఉన్నా.. ఏం చేస్తున్నా.. ఆత్మసంతృప్తి కీలకమని కామెంట్ చేశారు.

వైవిధ్యమైన విద్యతోనే దేశం ముందుకు..

ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. సైన్స్, ఆర్ట్స్, కమ్యూనికేషన్ వంటి వైవిధ్యమైన విద్యతోనే దేశం ముందుకు సాగుతుందని చెప్పారు. ‘‘ఇప్పుడు మనందరం వెస్టర్న్ ఎడ్యుకేషన్‌‌ను ఫాలో అవుతున్నాం. ఈ ఎడ్యుకేషన్‌‌ను అనుసరించడం మానేసినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని గాంధీ ఆనాడు చెప్పారు. పిల్లలు తల్లిదండ్రుల నుంచే కాకుండా సమాజం నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వారికి విలువలతో కూడిన విద్యను నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇల్లు, స్కూలు నుంచే అది జరగాలి” అని చెప్పుకొచ్చారు. మన సంస్కృతే మన గుర్తింపు అని, దాన్ని పాటించడం, అభివృద్ధి చేసుకోవడం మనందరి కర్తవ్యమని చెప్పారు. మన సంస్కృతిని వదిలేసి వేరే సంస్కృతి వైపు చూడడం మంచిది కాదని, మన సంస్కృతిని పాటిస్తున్నందుకు గర్వపడాలని పేర్కొన్నారు.

రాజ్యాంగం మార్చుడు అంత ఈజీ కాదు

మహిళలు అది చేయకూడదు.. ఇది చేయకూడదు అని ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, కానీ మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని ప్రెసిడెంట్ ముర్ము అన్నారు. దేవుళ్లందరూ తమ జీవితంలోని మహిళలకు విలువనిచ్చారని గుర్తు చేశారు. శివుడిని అర్ధనారీశ్వరుడని కొలుచుకుంటామని చెప్పారు. ఎక్కడ మహిళ ఉంటే అక్కడ శక్తి ఉంటుందని చెప్పారు. ‘‘చాలా మంది రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు.  దాన్ని మార్చాలంటే ఎన్నో చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని రాసినప్పుడు జనాభా తక్కువగా ఉన్నా.. కులం, మతం తేడాలుండేవి. ఇప్పుడు జనాభా పెరిగింది. నేటి విషయాలను దృష్టిలో పెట్టుకుని దేశ రాజ్యాంగాన్ని ఓసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది” అని వివరించారు.

అభివృద్ధిలో అందరూ భాగమవ్వాలి: కిషన్​రెడ్డి

‘‘వందేండ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ఎర్రకోటపై ఏ పార్టీ నాయకుడు జెండా ఎగురేసినా, ప్రధానిగా ఎవరున్నా.. మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉండాలన్నదే అందరి లక్ష్యం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. కులాలు, ప్రాంతాలు, మతాలకతీతంగా అభివృద్ధిలో అందరూ భాగమవ్వాలన్నారు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి చెప్పారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అన్నట్టుగా.. గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ముర్ము ఇవ్వాళ దేశ అత్యున్నత స్థానంలో కూర్చున్నారని కొనియాడారు.

స్టూడెంట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వంటి వాళ్లను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానానికి 13 నెలలు ఆలస్యంగా స్వాతంత్ర్యం వచ్చిందని, ఇక్కడి ప్రజలపై రజాకార్లు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆయన గుర్తు చేసుకున్నారు. వందలాది మంది నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం సలిపి బలిదానాలు చేశారని కొనియాడారు. చివరకు సర్దార్​ వల్లభ్ భాయ్ పటేల్ సైనిక చర్యతో 1948 సెప్టెంబర్​ 17న హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు.

ఇదే మహిళా సాధికారతకు నిదర్శనం: గవర్నర్

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికేందుకు వెళ్లినప్పుడు తనకెంతో గర్వంగా అనిపించిందని, ఓ మహిళా గవర్నర్, రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి వెళ్లి మహిళా రాష్ట్రపతిని స్వాగతించడం మహిళా సాధికారతకు నిదర్శనమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇటీవల బైరాన్​పల్లికి వెళ్లానని, అక్కడ నాటి నిజాం పాలకులు చేసిన ఆకృత్యాలు మనసును కలచివేశాయని గుర్తు చేశారు. హైదరాబాద్ మన దేశంలో లేదని అందరూ చెప్పినా.. 
తన చేతుల్లోనే ఉందని ఆనాడు వల్లభ్​భాయ్ పటేల్ చెప్పారని అన్నారు. నాడు ‘ఆపరేషన్ పోలో’లో భాగంగా ‘మీ తలలు కావాలా.. కిరీటాలు కావాలా?’ అని నిజాం పాలకులకు సర్దార్ పటేల్ చెప్పారని, ఆ వెంటనే నిజాం పాలకులు మన దేశం ముందు మోకరిల్లారని గుర్తు చేశారు.

మహిళలకు భద్రత, భరోసా ఇవ్వాలి: ముర్ము

ఐపీఎస్ అధికారులు దేశ అంతర్గత భద్రతతో పాటు మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీని ముర్ము సందర్శించారు. 74వ రెగ్యులర్ రిక్రూట్​మెంట్ ట్రైనీ ఐపీఎస్​లతో ఇంటరాక్ట్ అయ్యారు. వారితో పాటు భూటాన్, నేపాల్, మాల్దీవులుకు చెందిన ట్రైనీ అధికారులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. సరిహద్దు భద్రత‌‌ జవాన్ల చేతిలో ఉంటే.. దేశ అంతర్గత భద్రత ఐపీఎస్​ల చేతుల్లోనే ఉందన్నారు.

పీఎం అయితే ఏం చేస్తారు?

‘‘మీరు ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు?’’ అని విద్యార్థులను ముర్ము అడిగారు. దానికి వరుణ్ గణేశ్ కులకర్ణి అనే విద్యార్థి.. ‘సారే జహాసె అచ్చా హిందూస్తాన్ హమారా’ అంటూ తన సమాధానాన్ని ప్రారంభించాడు. దేశంలో సంస్కారాన్ని పెంపొందిస్తానని, మన కళలు, సంస్కృతి, సంగీతం వంటి వాటికి మళ్లీ జీవం పోసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. తాను ప్రధాని అయితే మన వేదాలు, పురాణాలను చిన్నప్పటి నుంచే రైమ్స్​గా స్కూళ్లలో చెప్పించే ప్రయత్నం చేస్తానని భాగ్యశ్రీ అనే స్టూడెంట్ చెప్పింది.

విమోచనమంటే.. మెరుగైన సమాజాన్ని నిర్మించడం

కేశవ్ మెమోరియల్ కాలేజీలో 40 శాతానికిపైగా అమ్మాయిలు ఉండడం తనకు చాలా సంతోషం కలిగించిందని ద్రౌపది ముర్ము అన్నారు. ఓ పురుషుడు చదువుకుంటే ఓ వ్యక్తిని మాత్రమే చదివించినట్టు అవుతుందని, కానీ మహిళను చదివిస్తే సమాజం మొత్తాన్ని ఎడ్యుకేట్ చేసినట్టేనని గాంధీ చెప్పారని గుర్తుచేశారు. విద్యార్థులతో ముచ్చట తర్వాత ఆమె సభనుద్దేశించి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించడం.. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాధాన్యంతో కూడుకున్నదని అన్నారు. రామోజీ గోండ్, తురేభాజ్ ఖాన్, కుమ్రం భీం, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయబుల్లా ఖాన్ వంటి వారి ధైర్యసాహసాలు, త్యాగాలను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. విమోచన దినోత్సవం అంటే నిరంకుశ పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే కాదని, మెరుగైన సమాజాన్ని నిర్మించడమని చెప్పారు.