బాలానగర్‌లో విషాదం: భార్య కాపురానికి రాలేదని పూజారి ఆత్మహత్య

బాలానగర్‌లో విషాదం: భార్య కాపురానికి రాలేదని పూజారి ఆత్మహత్య

​కుటుంబ కలహాలు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య కాపురానికి రావడం లేదనే మనస్థాపంతో ఓ పూజారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సైబరాబాద్ కమీషనరేట్ పరధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఆదివారం ( జూన్ 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ఐడీపీఎల్ టౌన్‌షిప్‌లోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న 42 ఏళ్ళ కొండూరి కిషోర్ శర్మ ఆదివారం మధ్యాహ్నం తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో ఏర్పడిన విభేదాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.

​పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కిషోర్ శర్మ ఎనిమిదేళ్ల క్రితం పిఠాపురం గ్రామానికి చెందిన మల్లేశ్వరి దేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు... అయితే, గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం మల్లేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి తీసుకురావడానికి కిషోర్ శర్మ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

​భార్యకు దూరం కాలేక మనస్థాపంతో, తీవ్ర ఒత్తిడికి లోనైన కిషోర్ శర్మ.. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సంచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి భైరవమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్యాభర్తల మధ్య గొడవలకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు పోలీసులు.