రాచకొండ గుట్టల్లో ఆదిమానవుల పెయింటింగ్స్

రాచకొండ గుట్టల్లో ఆదిమానవుల పెయింటింగ్స్

హైదరాబాద్, వెలుగు: రాచకొండ గుట్టల్లో కొత్త రాతియుగం, బృహత్ ​శిలాయుగానికి చెందిన ఆది మానవులు గీసిన చిత్రాలు, వాడిన పనిముట్లు వెలుగులోకి వచ్చాయి.వాటిని ప్రముఖ చరిత్రకారుడు ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు. రాచకొండ గుట్టల్లోని ఉత్తరం గట్టు నుంచి తూర్పు వైపునకు వెళ్తుంటే హృదయం ఆకారంలోని గుండు కింద గుహలున్నాయని ఆయన చెప్పారు. వాటిలో అరచేతిలో అమిరే పనిముట్లు కనిపించాయని తెలిపారు. నల్లసానపు బండతో చేసిన ఆ పనిముట్లు చేతిలో అమిరే గొడ్డలి, గోకుడు రాయిగా ఉపయోగించే వారని వెల్లడించారు. శైలిని బట్టి అవి పాత రాతి యుగపు మానవులు వాడినదిగా తెలుస్తున్నదని వివరించారు. 

తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తుపూర్వం 12,500 నుంచి 50 వేల ఏండ్ల మధ్య ఆదిమానవులు ఉన్నట్లు డాక్టర్​ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారని గుర్తుచేశారు. రాచకొండ ప్రాంతంలో ఆది మానవుల మనుగడ వెలుగులోకి రావడం ఇదే మొదటిసారని చెప్పారు. కొత్త రాతి యుగం నాటి ఆది మానవులు బర్మా లాంటి పనిముట్లను తయారు చేసినట్లు ఆధారాలు దొరికాయన్నారు. భోగిని మంటపాన్ని ఆనుకుని ఉన్న గుహరాయిపై ఆది మానవులు వేసిన చిత్రాలు కనిపించాయని తెలిపారు. నాలుగు అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో మూడు చిత్రాలు ఎరుపు రంగుతో వేశారన్నారు. ఎడమ వైపు చిత్రంలో బాణం ములికి, కుడి వైపు చిత్రంలో ఉడుము, మధ్య దానిలో మక్కజొన్న కంకి చిత్రాలు చిత్రించినట్లు వివరించారు. ఈ అరుదైన చిత్రాలను ప్రభుత్వం రక్షించే ప్రయత్నాలు చేయాలని సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.