బెయిల్ రాలేదని ఖైదీ ఉరేసుకున్నాడు

బెయిల్ రాలేదని ఖైదీ ఉరేసుకున్నాడు

పాలమూరు జిల్లా జైలులో ఖైదీ మృతి 

మహబూబ్​నగర్​ రూరల్, వెలుగు: బెయిల్ రాలేదని మనస్తాపం చెందిన ఓ ఖైదీ ఉరేసుకుని చనిపోయాడు. పాలమూరు జిల్లా జైలులో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం పాత పాలెం గ్రామానికి చెందిన ఊరబాయి వీరేశ్ (29) ఆగస్ట్ 20 నుంచి ఓ రేప్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వీరేశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఆమె రేప్ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు వీరేశ్ ను రిమాండ్ ఖైదీగా పాలమూరులోని జిల్లా జైలుకు తరలించారు.

కొన్ని రోజుల కింద అతడి మానసికస్థితి బాగలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి పంపించి, చికిత్స చేయించారు. శనివారం రాత్రి జైలు బ్యారక్ గదిలోనే పైన ఉన్న వెంటిలేటర్ కు బెడ్ షీట్ తో ఉరివేసుకున్నాడు. ఉరి వేసుకున్న వీరేశ్ ను గమనించిన జైలు గార్డులు వెంటనే కిందకు దించి, గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతుండగా అతడు చనిపోయినట్లు వన్​టౌన్​సీఐ రాజేశ్వర్​గౌడ్​ తెలిపారు. జైలు సూపరింటెండెంట్​ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామన్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి