పెట్రోల్ తెస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు

పెట్రోల్ తెస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు
  •  
  • అదుపులో సాయి డిఫెన్స్​ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు
  • దాడులు చేయాలని యువకులను రెచ్చగొట్టినట్లు గుర్తింపు
  • సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో ఆందోళనల కేసు దర్యాప్తు స్పీడ్​..
  • శనివారం రాత్రి దాకా మొత్తం 56 మంది నిందితుల అరెస్ట్
  • నిందితుల వాట్సాప్‌‌ గ్రూపుల ఆధారంగా సెర్చింగ్‌‌
  • లోకల్​ పోలీసులే కాల్పులు జరిపారన్న రైల్వే డీఆర్​ఎం గుప్తా

హైదరాబాద్‌‌ / పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్టేషన్‌‌లో దాడుల వెనుక ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలు ఉన్నట్లు గుర్తించారు. విధ్వంసానికి కుట్ర చేసిన ప్రధాన నిందితుడు ఆవుల సుబ్బారావు(58)ను ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి వరకు సుమారు 56 మందిని అరెస్ట్‌‌ చేశారు. రైల్వే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 19 మందికి గాంధీ హాస్పిటల్‌‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మెజిస్ట్రేట్‌‌ ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌‌కి తరలించారు. మిగతా నిందితులను విచారిస్తున్నారు. వారి ఫోన్లలోని వాట్సాప్‌‌ గ్రూపుల ఆధారంగా 250 మందికి పైగా దాడులకు పాల్పడినట్లు గుర్తించారు. గ్రూపుల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారి నంబర్స్‌‌ ఆధారంగా గాలిస్తున్నారు. గ్రూపుల్లో ఉన్న నంబర్లకు పోలీసులు ఫోన్​ చేసి విచారణకు హైదరాబాద్​ రావాలని చెప్తున్నారు. నిరసనకారుల ఆడియో రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోల్‌‌ బాటిల్స్‌‌, కర్రలు, రాడ్లతో దాడులు చేయాలని రెచ్చగొట్టినట్లు విచారణలో వెల్లడైంది. 

26 మంది కీలకం

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సుబ్బారావు సాయి డిఫెన్స్‌‌ అకాడమీ పేరుతో ట్రైనింగ్‌‌ సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని ఆర్మీ అభ్యర్థులకు ట్రైనింగ్‌‌‌‌ ఇస్తున్నాడు. అగ్నిపథ్‌‌‌‌ ప్రకటన వెలువడిన నాటి నుంచి సుబ్బారావుతో పాటు మరికొంత మంది కలిసి నిరసనలకు ప్లాన్‌‌‌‌ చేశారు. యూపీ తరహాలో రైల్వే స్టేషన్లలో ఆందోళన చేయాలని సోషల్‌‌‌‌ మీడియా గ్రూపుల్లో చర్చించారు. ఇందులో 26 మంది అభ్యర్థులు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 10కి పైగా ప్రైవేట్‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌ అకాడమీల నుంచి ఆందోళనకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.

18న చలో వైజాగ్‌‌‌‌కు ప్లాన్

సికింద్రాబాద్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఆందోళన కోసం ప్రత్యేకంగా ‘ఆర్మీ 17/06’ గ్రూప్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశారు. తర్వాత 18న ‘చలో వైజాగ్‌‌‌‌ ఏఆర్‌‌‌‌‌‌‌‌ఓ’ పేరుతో మరో ఆందోళనకు ప్లాన్ చేశారు. శనివారం ఉదయం 8 గంటల కల్లా వైజాగ్‌‌‌‌కు చేరుకుని, అక్కడ నిరసనలు చేయాలని అందులో పోస్టులు పెట్టారు. హకీంపేట్‌‌‌‌ ఆర్మీ సోల్జర్స్‌‌‌‌, ఆర్మీ లవర్స్‌‌‌‌, చలో సికింద్రాబాద్‌‌‌‌ రైల్వేస్టేషన్ బ్లాక్స్‌‌‌‌తో పాటు వివిధ గ్రూపుల్లో చాటింగ్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలోనే సుబ్బారావు గురువారం రాత్రే హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నాడు. సికింద్రాబాద్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ వద్ద ఆందోళనల తర్వాత శనివారం వైజాగ్‌‌‌‌ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అభ్యర్థులతో కలిసి సెల్ఫీ ఫొటో దిగాడు. అదే ఫొటోను గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఓ అభ్యర్థి హకీంపేట్‌‌‌‌ ఆర్మీ సోల్జర్స్‌‌‌‌ అనే గ్రూపులో పోస్ట్‌‌‌‌ చేశాడు. ‘‘ సుబ్బారావు గారు హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు. నిరసన ర్యాలీకి మద్దతు తెలపనున్నారు. మిగతా డైరెక్టర్లు కూడా సపోర్ట్‌‌‌‌ చేయాలి” అని కోరాడు.

గుంటూరు నుంచే 450 మంది

ఆదిలాబాద్‌‌‌‌ నుంచి వచ్చిన కృష్ణా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో రెండు కంపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఆర్మీ అభ్యర్థులు ట్రావెల్‌‌‌‌ చేసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌, ఉమ్మడి నల్గొండ, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, గుంటూరు జిల్లాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్‌‌‌‌ చేరుకున్నారు. సుబ్బారావుతో కలిసి గుంటూరు నుంచి 450 మంది వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్‌‌‌‌ డిఫెన్స్ అకాడమీలు, లాడ్జీలు, రైల్వే స్టేషన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై షెల్టర్‌‌‌‌ ‌‌‌‌తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో జిల్లాల నుంచి వచ్చిన వారితో కలిసి ఆందోళనలు చేశారు. తమ ఆందోళనల తీవ్రతను పెంచేందుకు పెట్రోల్‌‌‌‌ బాటిల్స్‌‌‌‌ తీసుకురావాలని గ్రూప్స్‌‌‌‌లో షేర్ చేసిన వాయిస్ మెసేజ్‌‌‌‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

గాయపడ్డ వారిలో ఐదుగురికి సర్జరీ

స్టేషన్‌‌‌‌లో జరిగిన దాడుల్లో గాయపడ్డ 13 మంది యువకుల్లో ఐదుగురికి సర్జరీలు చేశామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మిగిలిన 8 మంది పరిస్థితి బాగానే ఉందని, రెండు రోజులు అబ్జర్వేషన్‌‌‌‌లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామన్నారు. పిల్లెట్స్ (రబ్బర్ బుల్లెట్లు) ను సర్జరీ చేసిన వారి బాడీ నుంచి తీసివేశామని తెలిపారు.

గాంధీలో భారీ బందోబస్తు

గాంధీ ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. క్షతగాత్రులను పరామర్శించడానికి పీసీసీ చీఫ్ రేవంత్ శనివారం సాయంత్రం వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల కళ్లు గప్పి రేవంత్ అంబులెన్స్‌‌‌‌లో గాంధీలోకి ప్రవేశించే అవకాశం ఉందంటూ.. గేట్ వద్ద ప్రతి అంబులెన్స్‌‌‌‌ను ఆపి తనిఖీ చేశారు. 

పెట్రోల్ తెస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు

ఎంతసేపు ఒర్రుతర్రా.. ఒర్రిఒర్రి నోర్లు నొస్తయ్. అందుకే గమ్మున పోయి పెట్రోల్‌‌ తీసుకొచ్చి తగులపెట్టినమనుకో.. ఒక్కసారిగా న్యూస్‌‌ బయటకు పోతది. అంతేగానీ ఎంతసేపు ఒర్రినా బ్యానర్లు చూపించినా ఏమవ్వదు. పెట్రోల్‌‌ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు. 
‑ ఇది సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో ఆందోళనల సమయంలో బయటికొచ్చిన ఆడియో