ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్ల నీళ్ల దందా... హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో నీటి కొరతను ఆసరాగా చేసుకొని దోపిడీ..

ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ ట్యాంకర్ల నీళ్ల దందా... హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో నీటి కొరతను ఆసరాగా చేసుకొని దోపిడీ..
  • ఒక్కో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌కు వేలల్లో వసూలు.. కోట్లల్లో వ్యాపారం
  • 5 వేల లీటర్లకు వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు రేటు రూ.500, ప్రైవేటు రేటు రూ.2 వేలు 
  • గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,500 ట్యాంకర్లతో రోజూ 6 వేల నుంచి 8 వేల ట్రిప్పుల నీటి సరఫరా
  • పంట పొలాలు, నాలాలు, చెరువులు, జంట జలాశయాల 
  • సమీపంలో బోర్లు వేసి నీటిని తోడేస్తున్న ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎండల ప్రభావం తగ్గకపోవడంతో వాటర్ ట్యాంకర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు వాటర్​ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. కానీ వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కొందరు ప్రైవేట్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. ఫోన్ కొట్టగానే ఇంటి వద్దకే నీటి ట్యాంకర్ వస్తుండడంతో ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. 

వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ల చార్జీలకు, ప్రైవేట్ ట్యాంకర్ల చార్జీలకు చాలా తేడా ఉంటోంది. హైదరాబాద్‌‌ వెస్ట్ సిటీలో అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. మణికొండ, నార్సింగి, కోకాపేట, నానక్​రామ్​గూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, తెల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, మియాపూర్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.

వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లకు (5 వేల లీటర్లు) అయితే రూ.500, కమర్షియల్ అయితే (5 వేల లీటర్లు)రూ.800 తీసుకుంటోంది. అదే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్‌‌‌‌కు (5 వేల లీటర్లు) రూ.1,500 నుంచి రూ.2,000, 10 వేల లీటర్లయితే రూ.4 వేల నుంచి రూ.4,500 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్లను నియంత్రించేందుకు ప్రభుత్వం దగ్గర ఎలాంటి వ్యవస్థ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఏటా కోట్లల్లో వ్యాపారం.. 

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో మొత్తం 1,500 ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా వ్యాపారంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఏటా వేసవిలో రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇండ్లు కట్టుకునేవారు, అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, టౌన్‌‌షిప్‌‌లు, హాస్టళ్ల నిర్వాహకులు, కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవారు అధికంగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఈసారి భారీ ఎండలకు చాలా చోట్ల భూగర్భ జలాలు పడిపోయి, బోర్లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి పెరిగింది. వెస్ట్ సిటీ మాత్రమే కాకుండా మల్కాజిగిరి, ఎల్బీనగర్, హయత్​నగర్, బోయిన్‌‌పల్లి తదితర ప్రాంతాల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో డిమాండ్ పెరిగిందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌మెంట్ అధికారులే చెప్తున్నారు. 

వాటర్ బోర్డు ఇప్పటికే రోజుకు 19 వేల నుంచి 20 వేల ట్రిప్పులతో నీటిని సరఫరా చేస్తోంది. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బుక్ చేసిన వెంటనే వాటర్‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌ను డెలివరీ చేయలేకపోతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు, హాస్టళ్ల నిర్వాహకులు, హోటల్స్, మెస్‌‌లు, టిఫిన్ సెంటర్లు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో రోజుకు వీరు 6 వేల నుంచి 8 వేల ట్రిప్పులతో నీటి సరఫరా చేస్తున్నారు. 

అక్రమ బోర్లతో నీటిని తోడేస్తున్నరు..

ట్యాంకర్ల బుకింగ్‌‌లు పెరగడంతో ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, నీటిని తోడేస్తున్నారు. మణికొండ, వట్టి నాగులపల్లి, హిమాయత్​సాగర్, జన్వాడ తదితర ప్రాంతాల్లో జంట జలాశయాలకు సమీపంలో అక్రమంగా బోర్లు వేస్తున్నారు. సాధారణంగా బోర్లు వేయాలంటే రెవెన్యూ అనుమతి తప్పనిసరి. జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో బోర్లు వేయడం కూడా నిషిద్ధం. 

కానీ, కొందరు రాజకీయ నాయకుల అండతో, మరికొందరు పలుకుబడితో బోర్లువేసి కావాల్సినంత నీటిని తోడేస్తున్నారు. జలాశయాలు లేని చోట్ల కొందరు పంట పొలాలు, నాలాలు, చెరువుల సమీపంలోనూ, సొంత భూముల్లోనూ బోర్లు వేసుకుని దందా చేస్తున్నారు. వీరి కార్యకలాపాలపై ప్రభుత్వంలోని ఏ శాఖకు కూడా నియంత్రణ లేదు. వాటర్ బోర్డు తమకు సంబంధం లేదని చెప్తుండగా, రెవెన్యూ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతోంది. 

నీటి సమస్యకు కారణాలపై సర్వే..

వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో ట్యాంకర్ల బుకింగ్ జరగడంపై వాటర్ బోర్డు అధికారులు ఆరా తీశారు. కూకట్‌‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్, కొండాపూర్, చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో హైరైజ్ భవనాలు, అపార్ట్‌‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటినట్టు గుర్తించారు. 

ఇతర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల మేరకు బోర్లు ఉండగా, ఈ ప్రాంతాల్లో రెండు వేల ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెప్తున్నారు. ఈ ప్రాంతాల నుంచే గతేడాది రోజుకు వాటర్ బోర్డుకు 80 వేల ట్యాంకర్ల బుకింగ్‌‌లు వచ్చాయి. ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్‌‌లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా లేనట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్టు మెట్రోవాటర్​బోర్డు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. 

వారు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కౌన్సెలింగ్ చేశామని, చాలా మంది వాటిని నిర్మించుకుంటున్నారని చెప్పారు. దీని ఫలితాలు వచ్చే వర్షాకాలం తర్వాత తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోని వారి నుంచి ట్యాంకర్ చార్జీలను రెట్టింపు వసూలు చేసే ప్రతిపాదన ఉందని అధికారులు వెల్లడించారు.