స్పీకర్ చెప్పిందంతా కట్టుకథ: ప్రియాంక గాంధీ

స్పీకర్ చెప్పిందంతా కట్టుకథ: ప్రియాంక గాంధీ
  • ప్రధాని స్పీకర్ వెనుక దాక్కుంటున్నారని ఫైర్ 
  • అనూహ్య ఘటన జరగవచ్చన్న సమాచారంతోనే ఆపాను: స్పీకర్ ఓంబిర్లా 
  • ప్రతిపక్ష ఎంపీలు ఆయన చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టి గందరగోళం సృష్టించారు
  • నా ఆఫీసులోనూ దురుసుగా ప్రవర్తించారు
  • ఇది పార్లమెంట్ చరిత్రలోనే మాయని మచ్చ అని కామెంట్

న్యూఢిల్లీ: లోక్‌‌సభ స్పీకర్ ఓంబిర్లా గురువారం సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సభలో ప్రధాని మోదీ మాట్లాడాల్సి ఉందని, అయితే ఆ సమయంలో సభలో అనూహ్య సంఘటన జరగవచ్చని తనకు సమాచారం అందిందని తెలిపారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా తానే మోదీని సభకు రావొద్దని చెప్పానని వివరించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌‌సభలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టి, బ్యానర్లు ప్రదర్శించారు. అప్పటికి ప్రధాని సభలోకి రాలేదు. ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో సభను స్పీకర్ వాయిదా వేశారు. అయితే ఈ సంఘటనను స్పీకర్ ఓంబిర్లా గురువారం సభలో ప్రస్తావిస్తూ.. ‘‘రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, వాటిని సభ వరకు తీసుకొచ్చిన సందర్భాలు చరిత్రలో లేవు. కానీ నిన్న (బుధవారం) కొందరు ప్రతిపక్ష ఎంపీలు నా ఆఫీసులో దురుసుగా ప్రవర్తించారు. ఇది పార్లమెంట్ చరిత్రలోనే మాయని మచ్చ. ప్రధాని మోదీ ప్రసంగించే టైమ్‌‌లో గందరగోళం సృష్టించాలని ఎంపీలు ప్లాన్ చేసినట్టు నాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే సభ గౌరవం దెబ్బతింటుందని నేను ఆందోళన చెందాను.  అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ప్రధానిని సభకు రావొద్దని సూచించాను” అని తెలిపారు. స్పీకర్‌‌‌‌గా సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన విజ్ఞప్తిని మన్నించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇలాగే పోస్టర్లు, పాంప్లెట్లతో నిరసనలు తెలిపితే సభ ఇక నడవదని ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ హెచ్చరించారు. ఆపై సభను శుక్రవారానికి వాయిదా వేశారు.

ఆ రోజు సభలో ఏం  జరిగింది? 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌‌సభ ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో హోరెత్తింది. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించేందుకు రాహుల్‌‌కు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవడంపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నం12 గంటలకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నరవణె, రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ ఉన్న పోస్టర్లను కొందరు ఎంపీలు ప్రదర్శించగా.. నరవణె రాసిన పుస్తకం ఇదేనంటూ రాహుల్ చూపించారు. మరోవైపు గాంధీ ఫ్యామిలీ చరిత్ర చెప్తానంటూ పలు పుస్తకాలను బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే బయటకు తీశారు. వాటిల్లోని కొన్ని వాక్యాలను చదివారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేయగా, సభను సాయంత్రం 5 గంటలకు వాయిదా వేశారు. ఆ టైమ్‌‌లో ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్ చాంబర్‌‌‌‌కు వెళ్లారు. పుస్తకాల్లోని వాక్యాలను ప్రస్తావించడానికి అధికారపక్ష సభ్యులకు అనుమతి ఇచ్చి, ప్రతిపక్ష సభ్యులకు అనుమతి ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగా.. మహిళా ప్రతిపక్ష ఎంపీలు కొందరు ప్రధాని బెంచ్‌‌ను చుట్టుముట్టారు. అప్పటికి ఇంకా మోదీ సభకు రాలేదు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభను గురువారానికి వాయిదా వేశారు.