యూపీ పోలీసుల తప్పేంలేదు.. ప్రియాంక గాంధీ ప్రొటోకాల్ పాటించలేదు : సీఆర్ పీఎఫ్

యూపీ పోలీసుల తప్పేంలేదు.. ప్రియాంక గాంధీ ప్రొటోకాల్ పాటించలేదు : సీఆర్ పీఎఫ్

ఢిల్లీ: కాంగ్రెస్​ జనరల్​ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ సెక్యూరిటీ విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ అంశంలో ప్రియాంకకు సెక్యూరిటీ అందిస్తున్న సీఆర్​పీఎఫ్​ యూపీ పోలీసులను వెనకేసుకొచ్చింది. వారి తప్పు ఏమాత్రం లేదని, ప్రియాంకే ప్రొటోకాల్​ పాటించలేదని ఆరోపించింది. మరోవైపు తన సెక్యూరిటీ పెద్ద విషయం కాదని, యూపీలోని కామన్​మ్యాన్​కు భద్రత ఉందా లేదా అనేదే కీలకమని ప్రియాంక అన్నారు.

సమాచారం ఇవ్వలేదు: సీఆర్​పీఎఫ్

లక్నో టూర్​ సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రొటోకాల్​ పాటించలేదని సీఆర్​పీఎఫ్​ ఆరోపించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆమె రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి ఎస్ఆర్ దారాపురి ఇంటికి వెళ్లారని, ఇందులో భద్రతా బలగాల వైఫల్యం లేదని స్పష్టం చేసింది. ప్రియాంకకు ప్రస్తుతం జడ్​ ప్లస్​ కేటగిరీ భద్రత కొనసాగుతోంది. ఆమెకు సీఆర్ పీఎఫ్ కమాండోలు సెక్యూరిటీ అందిస్తున్నారు. లక్నోలో స్కూటర్‌‌పై ప్రియాంక వెళ్లిన ఘటనపై సీఆర్‌‌పీఎఫ్‌‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. లక్నోలో ఓ పోలీస్ సర్కిల్​ ఆఫీసర్​ తన సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారంటూ ప్రియాంక ఆఫీసు నుంచి ఫిర్యాదు అందిందని, అయితే ఆ అధికారి ఎటువంటి ఉల్లంఘనకు పాల్పడలేదని పేర్కొంది. డిసెంబర్​ 28న ఆమె షెడ్యూల్​లో లక్నోలోని పీసీసీ ఆఫీస్​కు వెళ్లే ప్రోగ్రాం ఒక్కటే ఉందని, కానీ సమాచారం ఇవ్వకుండానే ప్రియాంక స్కూట ర్​పై వెళ్లారని, అందువల్లే ముందస్తు చెకింగ్‌‌ జరగలేదని స్పష్టం చేసింది. ఆమె టూవీలర్​పై వెళ్లడం వల్ల మూడు సెక్యూరిటీ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది. భద్రతా అధికారి లేకుండా నాన్‌‌ బుల్లెట్‌‌ రెసిస్టెంట్‌ వెహికిల్‌‌ను వాడారని, పిలియన్‌‌ రైడర్‌‌ రూపంలో స్కూటర్​పై వెళ్లారని వెల్లడించింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ప్రియాంకకు పూర్తి భద్రత కల్పించామని తెలిపింది.

సామాన్యులకు సెక్యూరిటీ ఉందా?

తన సెక్యూరిటీకి సంబంధించిన వివాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయలేదు ప్రియాంక గాంధీ. ‘‘నా సెక్యూరిటీ అనేది పెద్ద విషయం కాదు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం లేదు. ఈ అంశాన్ని నేను లేవనెత్తను. ఎందుకంటే అది చాలా చిన్న విషయం. దీని కంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. యూపీలోని సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది కీలకం”అని చెప్పారు. దేశంలో విధ్వంసానికి, ప్రతీకారానికి చోటు లేదని ప్రియాంక గాంధీ అన్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారే పరిహారం చెల్లించాలన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​  కామెంట్లపై ఆమె విరుచుకుపడ్డారు. హిందూ ధర్మం అంటే శాంతికి ప్రతిరూపమని, కానీ కాషాయం ధరించిన వ్యక్తి ప్రతీకారం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కాషాయం హిందూ మతాన్ని సూచిస్తుందని, మతం అనేది హింస, లేదా ప్రతీకారాన్ని ప్రోత్సహించదని చెప్పారు. ప్రియాంక నాలుగు రోజుల యూపీ పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.