- శాటిలైట్ నెట్‌వర్క్‌ను రెడీ చేస్తున్న బ్రిటన్
ప్రాజెక్టు ఓబెరాన్: బ్రిటన్ చేపడుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో, రాత్రిళ్లూ భూమి ఉపరితలంపై నిఘా కోసం ఆ దేశం ఏర్పాటు చేయనున్న ఉపగ్రహాల నెట్వర్క్. ఈ అల్ట్రా హై రిజల్యూషన్ సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్లకు ఎయిర్‌బస్ సంస్థ టెక్నాలజీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ రిజల్యూషన్ ఉన్న కెమెరాలు, రేడియో ట్రాన్స్మిషన్ సెన్సర్లూ కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. వీటితో భూమిపై టార్గెట్లను గుర్తించడం, పరిశీలించడం ఆ దేశానికి సులువవనుంది. రేడియో ఫ్రీక్వెన్సీని కూడా గ్రహించేలా శాటిలైట్లను డిజైన్ చేస్తున్నారు. తొలుత 2022లో ప్రయోగాత్మకంగా ఓ శాటిలైట్‌ను పంపించనున్నారు. 2025 నాటికి ఒబెరాన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు బ్రిటన్‌కు సొంత ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్ లేదు. |
ఇప్పుడు ఆర్ఎఫ్ టెక్నాలజీదే హవా
రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాల ప్రసారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో గుర్తించడం ప్రస్తుతం బాగా వాడుకలో ఉన్న టెక్నాలజీ. ముఖ్యంగా సముద్రాలపై గస్తీ టైంలో దీన్ని బాగా వాడుతుంటారు. పైరేట్లు, చేపలు పట్టే వాళ్లు అధికారుల నుంచి తప్పించుకోడానికి తమ జీపీఎస్ ట్రాకర్లను ఆఫ్ చేస్తుంటారు. కానీ వాళ్లు రేడియోలు గానీ, వాళ్లకు వాళ్లు సమాచారం పంపించుకోవడానికి ఇతర వస్తువులేవైనా వాడితే ఒబెరాన్ ‘ఆర్ఎఫ్’ సెన్సర్స్‌తో వాళ్లను పట్టుకోవచ్చు. కొత్త శాటిలైట్లలో ఆక్స్ఫర్డ్ స్పేస్ సిస్టమ్ (ఓఎస్ఎస్) రెడీ చేసిన యాంటెన్నాలను వాడనున్నారు. ఈ కార్బన్ ఫైబర్ నిర్మాణాలు పైకి చిన్నగానే కనబడినా ఒకసారి కక్ష్యలోకి వెళ్లాక వాటి నిర్మాణం పెరుగుతుందని చెప్పారు. దీని ఆర్ అండ్ డీకి డిఫెన్స్ శాఖ నిధులిచ్చింది.
నోవాసర్ సక్సెస్‌తో..
ప్రస్తుతం బ్రిటన్ ఆర్మీ తమ నోవాసర్ శాటిలైట్ పంపిస్తున్న డేటాను విశ్లేషిస్తోంది. దీన్ని 2018 సెప్టెంబర్‌లో ప్రయోగించారు. బ్రిటన్ తయారు చేసిన తొలి ఆల్ బ్రిటిష్ రాడార్ శాటిలైట్ ఇది. ఎయిర్‌బస్, ఎస్ఎస్టీఎల్ కలిసి తయారు చేశాయి. ఈ శాటిలైట్ ప్రయోగం సక్సెస్ అవడంతో ఎయిర్‌బస్, యూకే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ (డీఎస్టీఎల్) కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపడుతున్నాయి. చిన్న శాటిలైట్ల నెట్‌వర్క్‌తో ఎక్కువ పెర్ఫామెన్స్‌ను రాబట్టడం ఒబెరాన్ ప్రత్యేకత. వరల్డ్ క్లాస్ సర్వైలెన్స్ సామర్థ్యంతో ఒబెరాన్ డిజైన్ చేస్తున్నామని, బ్రిటన్ ఆర్మీ ఎక్కడున్నా సాయం అందుతుందని ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ యూకే ఎండీ తెలిపారు. బ్రిటన్ ప్రస్తుతం వాడుతున్న స్కైనెట్ 5 టెలీకమ్యూనికేషన్స్ నెట్వర్క్ సిస్టమ్‌ను ఎయిర్‌బస్ తయారు చేసింది. తర్వాతి తరం స్కైనెట్ టెలీకమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌ను రెడీ చేస్తోంది.