పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చు.. తగ్గిన ఇండ్ల సేల్స్!

పెరిగిన రిజిస్ట్రేషన్ ఖర్చు.. తగ్గిన ఇండ్ల సేల్స్!

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌‌లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు తగ్గాయి.  సిటీలో ఫిబ్రవరిలో రూ. 2,722 కోట్ల విలువైన  5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కంపెనీ నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి  హైదరాబాద్‌‌లో రిజిస్ట్రేషన్‌‌ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా రిజిస్ట్రేషన్ రేట్లు పెరగడం ఇది రెండో సారి. రిజిస్ట్రేషన్ ఖర్చులు పెరగడంతో సిటీలో అపార్ట్‌‌మెంట్ల రిజిస్ట్రేషన్‌‌లు ఏడాది ప్రాతిపదికన 25 %  తగ్గాయని నైట్‌‌ ఫ్రాంక్ పేర్కొంది. కాగా,  హైదరాబాద్‌‌, మేడ్చల్‌‌–మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను హైదరాబాద్‌‌ రెసిడెన్షియల్ మార్కెట్‌‌ కింద చూస్తున్నారు. మార్కెట్‌‌ వాల్యూని పెంచడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెరిగాయి.   దీంతో సిటీలో హోమ్‌‌ సేల్స్ తగ్గాయని, అపార్ట్‌‌మెంట్ల సేల్స్ రిజిస్ట్రేషన్లు 25 % మేర పడ్డాయని  నైట్‌‌ ఫ్రాంక్ వివరించింది. 

స్మాల్ కేటగిరీపైనే ఎక్కువ ఎఫెక్ట్‌‌ 

రిజిస్ట్రేషన్‌‌ ఖర్చులు పెరగడంతో ఎక్కువగా నష్టపోయింది రూ. 25 లక్షల కంటే తక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీలేనని ఈ సంస్థ పేర్కొంది.  ఈ కేటగిరీలో ఫిబ్రవరిలో కేవలం 844 యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని నైట్‌‌ ఫ్రాంక్ వివరించింది. కిందటేడాది ఫిబ్రవరిలో ఈ నెంబర్ 2,888 యూనిట్లు గా ఉంది. ఈ సంస్థ చేసిన స్డడీ ప్రకారం,  ఫిబ్రవరి నెలలో జరిగిన మొత్తం రెసిడెన్షియల్  ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో రూ. 50 లక్షల కంటే తక్కువ వాల్యూ ఉన్న రెసిడెన్షియల్  ప్రాపర్టీల వాటా 69 శాతంగా ఉంది. కిందటేడాది ఫిబ్రవరిలో అయితే ఈ వాటా 76 శాతంగా రికార్డయ్యింది.  ఈ కేటగిరీలో కూడా రూ. 25 లక్షల కంటే తక్కువ వాల్యూ ఉన్న కేటగిరీలో సేల్ రిజిస్ట్రేషన్లు ఈ సారి 16 శాతంగానే రికార్డయ్యాయి. కిందటేడాది ఫిబ్రవరిలో ఈ సెగ్మెంట్ వాటా  42 శాతంగా ఉంది. 

మిడ్‌‌, హై లెవెల్ సెగ్మెంట్‌‌లు ఓకే..

రెసిడెన్షియల్ ప్రాపర్టీలలో రూ. 50 లక్షల లోపు వాల్యూ ఉన్న కేటగిరీ, ధరలకు  ఎక్కువ సెన్సిటివ్‌‌గా ఉంటుందని నైట్‌‌ ఫ్రాంక్ స్టడీ అభిప్రాయపడింది.  హైదరాబాద్ మార్కెట్‌‌లో ఈ కేటగిరీలోనే ఎక్కువ సేల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపింది. తాజాగా రిజిస్ట్రేషన్‌‌ రేట్లు పెరగడంతో ఈ కేటగిరీలో రిజిస్ట్రేషన్లు పడ్డాయని వివరించింది. మిగిలిన కేటగిరీలలో సేల్‌  రిజిస్ట్రేషన్లు నిలకడగా ఉన్నాయి.  సిటీలో ఫిబ్రవరిలో జరిగిన మొత్తం  రెసిడెన్షియల్ సేల్‌ రిజిస్ట్రేషన్లలో రూ. 25 లక్షల నుంచి రూ.   50 లక్షల మధ్య వాల్యూ ఉన్న కేటగిరీ వాటా 52 శాతానికి పెరిగింది. కిందటేడాది ఫిబ్రవరిలో జరిగిన మొత్తం రెసిడెన్షియల్ సేల్‌ రిజిస్ట్రేషన్లలో ఈ సెగ్మెంట్ వాటా 34 శాతంగా రికార్డయ్యింది. మరోవైపు సిటీలోని మిడ్‌‌, హై సెగ్మెంట్‌‌లో గ్రోత్ కనిపించింది.   1000 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న యూనిట్ల సేల్స్‌‌ ఫిబ్రవరిలో పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మొత్తం రెసిడెన్షియల్ సేల్‌  రిజిస్ట్రేషన్లలో ఈ  సెగ్మెంట్ వాటా 85 శాతంగా ఉండడం విశేషం.  ఇందులో 1,000–2,000 చదరపు అడుగుల సైజు ఉన్న  ఇండ్ల వాటా 74 శాతంగా ఉంది.

సిటీలోనే సేల్స్ తగ్గాయ్‌‌..

ఎక్కువగా హైదరాబాద్ జిల్లాలోనే సేల్స్ తగ్గాయని నైట్‌‌ ఫ్రాంక్ వివరించింది. కిందటేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఫిబ్రవరిలో హైదరాబాద్‌‌ జిల్లాలో సేల్స్ రిజిస్ట్రేషన్లు 64 శాతం తగ్గాయని తెలిపింది. అంతేకాకుండా మొత్తం హైదరాబాద్ మార్కెట్‌‌ (హైదరాబాద్‌‌, మేడ్చల్‌‌–-మల్కాజ్‌‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల) లో  ఫిబ్రవరిలో జరిగిన సేల్‌ రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా 10 శాతానికి తగ్గింది. కిందటేడాది ఫిబ్రవరిలో ఈ వాటా 20 శాతంగా రికార్డయ్యింది. 

కొత్తగా వచ్చిన ఇండ్లు ఎక్కువగా అమ్ముడయ్యాయ్‌‌

కిందటేడాది హైదరాబాద్ మార్కెట్‌‌లో అందుబాటులోకి వచ్చిన కొత్త రెసిడెన్షియల్ యూనిట్లలో 55 శాతం యూనిట్లు అమ్ముడయ్యాయని ప్రాపర్టీ అడ్వైజరీ సంస్థ అనరాక్ ప్రకటించింది. అదే ముంబై మెట్రోపాలిటన్‌‌ (ఎంఎఆర్‌‌‌‌), నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌‌సీఆర్‌‌‌‌) లలో కొత్తగా లాంచ్ అయిన ప్రాపర్టీలు తక్కువగా సేల్‌‌ అయ్యాయని వివరించింది. కిందటేడాది హైదరాబాద్‌‌ మార్కెట్‌‌లో 25,410 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇందులో 55 శాతం యూనిట్లు అదే ఏడాది మార్కెట్‌‌లోకి వచ్చినవే. ఎంఎంఆర్‌‌‌‌లో 76,400 యూనిట్లు అమ్ముడు కాగా, ఇందులో 26 శాతం యూనిట్లు మాత్రమే ఆ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. ఎన్‌‌సీఆర్‌‌‌‌లో 40,050‌‌‌‌ యూనిట్లు సేల్ అయ్యాయని, ఇందులో 30 శాతం మాత్రమే కిందటేడాది కొత్తగా లాంచ్ అయ్యాయని అనరాక్ ప్రకటించింది.

దేశంలోని రియల్‌‌ ఎస్టేట్ మార్కెట్‌‌లో ధరల పెరుగుదల పరంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. కానీ, సేల్‌ రిజిస్ట్రేషన్లు మాత్రం ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో తగ్గాయి. ఒమిక్రాన్ కేసులు ఎక్కువవ్వడం, ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్‌‌ ఖర్చులు పెరగడమే దీనికి కారణం. 
- శిశిర్ బైజల్, నైట్‌‌ ఫ్రాంక్ ఇండియా ఎండీ