పోషకాల ఆహారం : పాలకూర కిచిడి.. నవాబ్ కిచిడి.. .. ఇవి తింటే ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేయాల్సిందే..!

పోషకాల ఆహారం  : పాలకూర కిచిడి.. నవాబ్ కిచిడి.. .. ఇవి తింటే ఆహా ఏమి రుచి అంటూ లొట్టలేయాల్సిందే..!

సాదారణంగా పిల్లలు వెజిటబుల్స్ తినాలంటే కొంచెం మారాం చేస్తారు. కానీ, పిల్లలకు సంపూర్ణ పోషకాలు అందాలంటే వెజిటబుల్ కిచిడి పెట్టాల్సిందే. అంతేకాదు, చలికాలంలో తక్కువ మసాలాలతో చేసుకునే కిచిడీలు అన్ని వయసుల వాళ్లకు మంచిది. పైగా సులభంగా అరుగుతుంది కూడా. ఎంతో రుచికరమైన వెజిటబుల్ టేస్టీ కిచిడీలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . 

పాలకూర​ కిచిడి తయారీకి కావలసినవి

  • పాలకూర: రెండు కప్పులు
  • పల్లీలు: పావు కప్పు
  • పెసరపప్పు: అర కప్పు
  • బాస్మతి బియ్యం :అర కప్పురం
  • ఉల్లిపాయ తరుగు: పావు కప్పు 
  • టొమాటో: ఒకటి
  • అలుగడ్డ :ఒకటి
  • దాల్చినచెక్క: చిన్నముక్క
  • బిర్యానీ ఆకు :ఒకటి
  • లవంగాలు: రెండు
  • యాలకులు: రెండు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
  • పచ్చిమిర్చి:రెండు
  • జీలకర్ర :అర టీస్పూన్
  • పసుపు :పావు టీస్పూన్
  • నూనె : రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు :తగినంత

పాలకూర​ కిచిడి తయారీ విధానం 

పాలక్​ కిచిడి తయారీ కోసం బాస్మతి బియ్యం, పెసరపప్పు అరగంట పాటు నానబెట్టాలిపాలకూరను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి.

తర్వాత కుక్కర్లో నూనె వేడి చేసి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగించాలి.

ఉల్లిపాయ తరుగు వేసి రంగు మారే వరకు వేగించి అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి. అవి వేగిన తర్వాత పసుపు, టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. 

Also Read : ఆరెంజ్ జ్యూస్‌లో చక్కెర కలపడం మంచిదేనా?

అలుగడ్డ ముక్కలు, పల్లీలు వేసి మరోరెండు నిమిషాలు వేగాక పాలకూర పేస్ట్ కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.  ఈ మిశ్రమంలో నానబెట్టిన బాస్మతి బియ్యం, పెసరపప్పు వేసి సరిపడా నీళ్లు,ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు  కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టౌ నుంచి దించేయాలి.అంతే ఘుమఘుమలాడే,పోషకాలు నిండిన వేడివేడి పాలక్ కిచిడి రెడీ.


నవాబి కిచిడి  తయారీకి కావలసినవి

  • బ్రౌన్ రైస్: కప్పు 
  • పెసరపప్పు :ముప్పావు కప్పు
  • నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
  • షాజీరా : ఒక టీస్పూన్, 
  • లవంగాలు: మూడు
  • దాల్చిన చెక్క :చిన్న ముక్క
  • యాలకులు: మూడు 
  • ఇంగువ :చిటికెడు
  • కరివేపాకు: రెండు రెబ్బలు
  • జీడిపప్పు :50 గ్రాములు (గార్నిష్ కోసం కొంచెం పక్కన పెట్టి మిగిలినవి పేస్ట్ చేయాలి)
  •  ప్రెష్ క్రీం :అర కప్పు
  • పుదీనా తరుగు : రెండు టీస్పూన్లు.
  • కొత్తిమీర తరుగు :ఒక టేబుల్ స్పూన్
  • పాలు : కప్పు
  • అల్లం, వెల్లుల్లి పేస్ట్: ఒక టీస్పూన్ 
  • మిరియాల పొడి : పావు టీస్పూన్
  • ఉప్పు: సరిపడ
  • పచ్చిమిర్చి తరుగు : రెండు టీస్పూన్లు
  • పనీర్​: 100 గ్రాములు
  • వచ్చి బఠాణీలు: ముప్పావు కప్పు

నవాబి కిచిడి తయారీ విధానం

ముందుగా  బియ్యం, పప్పు కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టి నీళ్లు పడగట్టి పక్కన పెట్టాలి.ప్రెషర్ కుక్కర్​ లో  కొంచెం నెయ్యి వేసి షాజీరా లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కరివేపాకు, ఇంగువ, పుదీనా తరుగు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు పేస్ట్​వేసి మరోనిమిషం వేగించాలి. 

ఇప్పుడు బియ్యం, పప్పు, పాలు వేసి బాగా కలిపి అందులోనే ప్రెష్ క్రీం కూడా కలిపి తగినన్ని నీళ్లు పోసి ఒక నిమిషం ఉడికిం చాలి. తర్వాత సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఆపేయాలి. 

చివరిగా బంగారు రంగు వచ్చే వరకు వేగించిన పనీర్ ముక్కలు, పచ్చి బఠాణీలు, జీడిపప్పుతో పాటు మిరియాల పొడిని కిచిడీపై గార్నిష్ చేసి తినేయాలి..

ఈ కిచిడి రెసిపీలు ఎంతో ఆరోగ్యకమైన ఆహారం.  ఇవి మన ఇమ్యూనిటి పవర్​ ను పెంచుతాయి.   ముఖ్యంగా బ్లడ్​ లోపంతో ఇబ్బంది పడే వారికి ఈకిచిడి మంచి ఔషధంగా పనిచేస్తుంది. బియ్యం.. పప్పుల కలయిక కిచిడి శరీరానికి  కావలసిన ప్రోటీన్లను అందిస్తాయి.