- మున్సిపల్ ఆఫీస్ ఎదుట కొట్టుకున్న కౌన్సిలర్ భర్త
జహీరాబాద్, వెలుగు : మున్సిపల్ చైర్మన్, కమిషనర్ వైఖరిని నిరసిస్తూ ఓ కౌన్సిలర్ భర్త తనను తాను చెప్పుతో కొట్టుకొని నిరసన తెలిపారు. ఈ ఘటన జహిరాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద జరిగింది. గురువారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా రాంనగర్ వార్డు కౌన్సిలర్ భర్త సోనీర్ మియా అక్కడికి చేరుకున్నారు. తాము ఎంఐఎం నుంచి గెలిచి, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి మద్దతు తెలిపామని, గత ఆరు నెలలుగా తమ వార్డులో కనీస అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ఈ విషయాన్ని చైర్మన్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్డు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నామన్నారు. వార్డులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ క్యాండిడేట్ కు మద్దతు తెలిపి గెలిపించినందుకు ప్రాయశ్చిత్తంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు.
తమ వార్డుకు నిధులు కేటాయించాలని ఎంపీ సురేశ్ షెట్కార్, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డిని కోరానని, వారు కూడా నిధులు కేటాయించాలని చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
