‘పుల్వామా’ సూత్రధారి హంజా బుర్హాన్ హతం.. పీవోకేలో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు 

‘పుల్వామా’ సూత్రధారి హంజా బుర్హాన్ హతం.. పీవోకేలో కాల్చిచంపిన గుర్తు తెలియని వ్యక్తులు 
  • పాక్​లో కొనసాగుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల వరుస హత్యలు 

న్యూఢిల్లీ: పుల్వామా టెర్రర్ అటాక్‌‌‌‌ కీలక సూత్రధారి, నిషేధిత ‘అల్- బద్ర్’ సంస్థ కమాండర్ హంజా బుర్హాన్  పీవోకేలో హతమయ్యాడు. ముజఫరాబాద్‌‌‌‌లో బైక్‌‌‌‌లపై వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు స్పాట్‌‌‌‌లో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూ కాశ్మీర్‌‌‌‌లోని పుల్వామా జిల్లా రత్నిపోరా నివాసి అయిన హంజా, 2017లో ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ వెళ్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పి బార్డర్ దాటాడు. 

అక్కడ పాక్ మద్దతుతో నడిచే ‘అల్-బద్ర్’ ఉగ్రవాద సంస్థలో చేరాడు. తన క్రూరమైన వ్యూహాలతో తక్కువ కాలంలోనే ఆ సంస్థలో అగ్ర కమాండర్‌‌‌‌గా ఎదిగాడు. ఆ తర్వాత మళ్లీ కాశ్మీర్ లోయలోకి చొరబడి, స్థానిక యువతను తీవ్రవాదం వైపు మళ్లించడంలో బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్‌‌‌‌లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఇతడు పెద్ద ఎత్తున ఉగ్ర నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను విస్తరించాడు. 

పుల్వామా అటాక్‌‌‌‌లో కీలక పాత్ర

జైషే మహమ్మద్ (జేఈఎం) టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లేత్‌‌‌‌పోరా వద్ద సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ కాన్వాయ్‌‌‌‌పై జరిపిన సూసైడ్ అటాక్‌‌‌‌లో హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడు. ఈ దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలు, గ్రెనేడ్లను టెర్రరిస్టులకు సమకూర్చింది బుర్హానేనని భారత భద్రతా సంస్థల దర్యాప్తులో తేలింది. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2022లో అతడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది.  ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ నుంచి తప్పించుకోవడానికి అతడు తిరిగి పీవోకేకు పారిపోయాడు. ఈ క్రమంలోనే అతడి హత్య జరిగింది.