ఒలింపిక్స్: పతకాల వేటలో దూసుకెళ్తోన్న భారత ఆటగాళ్లు

ఒలింపిక్స్: పతకాల వేటలో దూసుకెళ్తోన్న భారత ఆటగాళ్లు

ఒలింపిక్స్‌లో స్టార్ షట్లర్ పీ.వీ. సింధు హవా కొనసాగుతోంది. ఫ్రీ క్వార్టర్స్‌లో డెన్మార్క్ ప్లేయర్ బ్లిక్ ఫెల్ట్‌తో జరిగిన మ్యాచులో సింధు పూర్తిగా  ఆధిపత్యం చలాయించింది. ఈ మ్యాచ్‌లో 21-15,21-13 తేడాతో బ్లిక్ ఫెల్ట్‌ను సింధు చిత్తు చేసింది. వరుసగా మూడు విజయాలతో  గ్రూప్-జెలో సింధు టాప్ ప్లేసులో నిలిచింది. ఈ విజయంతో క్వార్టర్స్‌లోకి సింధు దూసుకెళ్లింది. మొత్తం 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి కోలుకోవడానికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. దీంతో సింధు మెడల్ గెలుచుకోవడానికి అవకాశాలు మరింత దగ్గరయ్యాయి. క్వార్టర్స్‌లో గెలిస్తే పతకం ఖాయం కానుంది. సింధు క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ అకానె యమగూచితో పోటీపడనుంది.

ఇకపోతే ఇండియన్ మెన్స్ హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌లో మరో విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన నాలుగో మ్యాచులో  డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటినాపై గెలుపొందింది. అర్జెంటినాపై 3-1 తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించింది. మూడో క్వార్టర్‌లో  మొదటి గోల్ చేసిన భారత హకీ జట్టు.. నాలుగో క్వార్టర్‌లో రెండు గోల్స్‌తో అదరగొట్టింది. భారత ప్లేయర్ వరుణ్ కుమార్ 43వ నిమిషంలో ఫస్ట్  గోల్ కొట్టగా.. 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్ సాగర్ రెండో గోల్ కొట్టాడు. ఆ కాసేపటికే హర్మన్ ప్రీత్ సింగ్ మూడో గోల్‌తో భళా అనిపించాడు. ఇప్పటివరకూ నాలుగు మ్యాచులు ఆడిన ఇండియన్ మెన్స్ హాకీ టీం.. మూడింటిలో గెలుపొందింది. ఈ గెలుపుతో మెన్స్ హాకీ టీం క్వార్టర్ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. తర్వాతి మ్యాచులో జపాన్‌తో తలపడనుంది. 

 

ఆర్చరీ విషయానికొస్తే.. ఇండియన్ ఆర్చర్ అతాను దాస్ ఫ్రీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఎలిమినేషన్ రౌండ్‌లో కొరియన్ ఆటగాడు జిన్ హెక్‌పై విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన పోరులో జిన్ హెక్‌పై 6-5 తేడాతో విజయం  సాధించాడు. జిన్ హెక్ 2016 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు మొత్తంగా నాలుగు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించాడు.

ఒలింపిక్స్ బాక్సింగ్‌లో భారత బాక్సర్ సతీష్ కుమార్ విజయం సాధించాడు. 91 కిలోల విభాగంలో జమైకా బాక్సర్ పై సతీష్ కుమార్ విన్ అయ్యారు. జమైకన్ బాక్సర్ బ్రౌన్ రికార్డోపై 4-1 తేడాతో సతీష్ కుమార్ గెలిచాడు. ఈ విజయంతో సతీష్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌లోకి  దూసుకెళ్లాడు.