బీసీ బిల్లు అమలుకు సహకరించండి

బీసీ బిల్లు అమలుకు సహకరించండి

 

  • మధ్యప్రదేశ్ సీఎంకు ఆర్. కృష్ణయ్య వినతి 

బషీర్ బాగ్, వెలుగు: బీసీ హక్కుల సాధన కోసం తాము చేసే ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​ను రాజసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కోరారు. శనివారం హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన శివరాజ్ సింగ్​ను కృష్ణయ్య కలిశారు. బీసీ బిల్లుపై మధ్యప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎంకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విద్యా, ఉద్యోగ, ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కీమ్​లను మధ్యప్రదేశ్​లోనూ అమలు చేయాలని సూచించారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ ద్వారా తెలంగాణలోని లక్షలాది మంది స్టూడెంట్లు ఫ్రీగా ఇంజినీరింగ్, మెడిసిన్, పీజీ- డిగ్రీ తదితర కోర్సులను చదువుతున్నారని తెలిపారు. 

విద్య ద్వారానే బీసీ కులాలలో సంపూర్ణ, సమగ్ర వికాసం లభిస్తుందని అన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు దక్కేలా  కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా రాజ్యాంగ సవరణకు సహకరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ ఏర్పాటు అవసరమన్నారు. ఈ డిమాండ్లు న్యాయమైనవని వీటికి పార్టీ పరంగా పూర్తి మద్దతిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చినట్లు ఆర్.కృష్ణయ్య తెలిపారు. బీసీల సమస్యలపై ప్రధానితో చర్చిస్తామని చెప్పినట్లు వెల్లడించారు.  ఎంపీ సీఎం కలిసినవారిలో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్  కృష్ణ,   తదితరులు ఉన్నారు.