V6 News

రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నది

రాష్ట్ర ప్రభుత్వం బీసీలను  నిర్లక్ష్యం చేస్తున్నది

ముషీరాబాద్, వెలుగు: బీసీ బంధు పథకం ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్  చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నదని, బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు. బీసీ బంధును తీసుకొచ్చి ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్  చేస్తూ బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్  వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో  స్టూడెంట్లు శుక్రవారం ఖైరతాబాద్ లోని బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆఫీసు ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ సంవత్సరం కింద బీసీ బంధ పథకం ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటించారని గుర్తుచేశారు.

ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీ బంధు అమలు చేయాలని కోరారు. ఇప్పటికే బీసీల కుల వృత్తులు దెబ్బతిని ఆర్థికంగా వారు చితికిపోయారని, బీసీలోని అనేక కులాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ 12 బీసీ కుల ఫెడరేషన్లు నామమాత్రంగా నిధులు లేక ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యాయని విమర్శించారు. ప్రేవేట్ యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేశారని, 294 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 290 బీసీ గురుకుల విద్యాసంస్థలకు ఒక్కదానికి కూడా సొంత భవనం నిర్మించలేదని మండిపడ్డారు. బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్  చేయకుండా బీసీలు చదువుకోకుండా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇస్తున్నదని, అలాగే ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి ఫీజులు ఇస్తున్నదని, కానీ హిందూ బీసీలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రదర్శనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్  గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-