V6 News

షుగర్ ఉన్నవారు పండ్లు తినకూడదా..? రక్తంలో చక్కెరను తగ్గించే 5 అద్భుతమైన పండ్లు ఇవే!

 షుగర్ ఉన్నవారు పండ్లు తినకూడదా..? రక్తంలో చక్కెరను తగ్గించే 5 అద్భుతమైన పండ్లు ఇవే!

పండ్లు ఆరోగ్యకరమైన ఆహారంలో ఒక భాగమే, అయినసరే మధుమేహం ఉన్నవారు ఎక్కువగా వాటికి దూరంగా ఉంటారు. రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉండడానికి  పండ్లను పూర్తిగా తినకూడదని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి, కొన్ని రకాల పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో చాల ఉపయోగకరంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు మితంగా తినగలిగే కొన్ని పండ్లు  గురించి మీకోసం.....

1. బెర్రీలు :
బెర్రీల అంటే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీలు, లింగన్‌బెర్రీలు, రాస్ప్‌బెర్రీలు  వంటివి మధుమేహ రోగుల ప్రాణ స్నేహితులు అని పిలవవచ్చు. ఎందుకంటే వీటిలో 'గ్లైసెమిక్ ఇండెక్స్' (GI) చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర పెరగదు.  ఈ బెర్రీలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి,  ఇవి టైప్ 1 మధుమేహం నుండి కూడా రక్షణను అందిస్తాయి . ఒక కప్పు బెర్రీలు 15-20 గ్రాముల కార్బోహైడ్రేట్లను అందిస్తాయి. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, బెర్రీలు టైప్ 1 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించగలవని కనుగొన్నారు.  

2. ఆపిల్స్:
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్న మాట మధుమేహులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఆపిల్స్‌లో 'పెక్టిన్' అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను కంట్రోల్ చేయడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే ఆపిల్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే, వీటిని మితంగా తీసుకోవాలి.

3. మామిడి పండ్లు:
చాలామంది మామిడి పండు తింటే చక్కెర పెరుగుతుందని భయపడతారు. కానీ నిజానికి మామిడి పండ్లు లిమిట్లో తింటే మేలే చేస్తుంది. ఎందుకంటే  మామిడిలో కేవలం చక్కెర మాత్రమే కాదు, ఫైబర్ & ముఖ్యమైన విటమిన్లు కూడా ఉంటాయి. బయట దొరికే స్వీట్ల కంటే మామిడి పండు తినడం మేలు. మామిడి పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే, రోజుకు ఒక చిన్న ముక్క లేదా పరిమితంగా తీసుకోవడం మర్చిపోవద్దు.

4. కివి పండ్లు:
కివి పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరం లాంటిది. ఎందుకంటే  దీనిలో విటమిన్-సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చక్కెర నెమ్మదిగా కలుస్తుంది, దీనివల్ల షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. రోజుకు ఒకటి లేదా రెండు కివి పండ్లు తినొచ్చు.

5. అవకాడో పండ్లు:
అవకాడోలు మిగిలిన పండ్ల కంటే భిన్నమైనవి, చాలా ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే  వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలపై అస్సలు ప్రభావం చూపవు. ఇవి తింటే కడుపు నిండుగా అనిపిస్తుంది, దీనివల్ల పదే పదే ఆకలి వేయదు. అవకాడో  గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

 గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ పండైనా సరే అతిగా కాకుండా  మోతాదులో తింటేనే ఆరోగ్యానికి మంచిది. మీ ఆహారంలో వీటిని చేర్చుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.