సినీ ప్రపంచంలో వారసత్వం ఉన్నా, ప్రతిభ ఉన్నా కొన్నిసార్లు 'రూపం' చూసి వెక్కిరించే లోకం ఇది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం ధనుష్ కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. కానీ నేడు ఆయన ఒక గ్లోబల్ స్టార్. లేటెస్ట్ ఆయన నటించిన చిత్రం ' కర( Kara )' ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఏప్రిల్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ధనుష్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలు, తన విజయ రహస్యం గురించి పంచుకున్నారు. ప్రస్తుత ఈ భావోద్వేగపూరితమైన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అవమానాల నుండి..
ఈ వేడుకలో ధనుష్‌కు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన 'పొల్లాదవన్' (2007) చిత్రంలోని బైక్ నంబర్ ప్లేట్‌ను బహుమతిగా అందించారు. దాన్ని చూసి ముసిముసి నవ్వులు చిందించిన ధనుష్, ఆ సినిమా వెనుక ఉన్న తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. "పొల్లాదవన్ నా కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ సినిమా రాకముందు నన్ను చాలా మంది విమర్శించేవారు. నేను చాలా సన్నగా ఉంటానని, హీరో మెటీరియల్ కాదని హేళన చేసేవారు. కానీ పొల్లాదవన్‌లో నేను సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించగానే, మొదటిసారి నా దేహశైలిని చూసి థియేటర్లలో ఈలలు వేశారు. ఆ ఆనందం నాకు ప్రత్యేకం" అని ఆయన చెప్పుకొచ్చారు.
సక్సెస్ మంత్రం..
నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ధనుష్ ఒక గొప్ప సందేశాన్ని అందించారు. భగవద్గీతలోని 'యద్భావం తద్భవతి' అనే సూత్రాన్ని ఆయన గుర్తు చేశారు. 2002-2003 కాలంలో నేను జాతీయ అవార్డు గెలుస్తానని చెబితే అందరూ నవ్వేవారు. కానీ నేను మాత్రం నా విజయంపై ఎప్పుడూ అనుమానం పెట్టుకోలేదు. మనల్ని మనం నమ్మాలి. నేను స్ట్రాంగ్‌గా అనుకున్నాను, పట్టుదలతో పని చేశాను.. కాలం కలిసి వచ్చింది, జాతీయ అవార్డులు వరించాయి. ధనుష్ అన్నట్టుగానే, ఆయన 'ఆడుకలం' , 'అసురన్' చిత్రాలకు ఉత్తమ నటుడిగా రెండుసార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.
' కర'గా థియేటర్లలోకి..
ఇక ధనుష్ తదుపరి చిత్రం ' కర( Kara )' గురించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ధనుష్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. వరుస బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామాలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజారమూడు కీలక పాత్రలో కనిపిస్తున్నారు. వేల్ప్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ధనుష్ మ్యానరిజమ్స్, ఇంటెన్స్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

