- ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో విద్యార్థులు, యువత ధర్నా
ముషీరాబాద్, వెలుగు: మన దేశ విద్యారంగంలో సమూల మార్పులు రావాలని సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులు రవిషా అన్నారు. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వీ స్టాండ్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత హాజరై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పదవిలో ఉన్నవాళ్లను దింపడం తేలికైన విషయం కాదని అందరూ అనుకుంటారని, కానీ ఐక్యంగా ఉంటే సాధ్యమవుతుందన్నారు.
ఢిల్లీలో విద్యార్థులు, యువత చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసిందని అనుకోవద్దని, తమ అకౌంటబిలిటీని ఇలాగే కొనసాగిస్తూ అందరూ ఐక్యతతో ఉంటే ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
నీట్ నిర్వహణ వైఫల్యాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని, ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
