మోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు: రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు: రాహుల్ గాంధీ

 

  • మోదీ ప్రభుత్వానికి బాధ్యత తెలియదు
  •     లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 
  •     కేంద్రం యువత కలలను ఛిన్నాభిన్నం చేస్తోందని ఫైర్

న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, రద్దవుతున్న రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఆకాశాన్నంటుతున్న ఫీజులు, ప్రైవేటీకరణ వంటి అస్త్రాలతో మోదీ ప్రభుత్వం ప్రతిరోజూ కోట్లాది మంది యువత కలలను ఛిన్నాభిన్నం చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రతి యంగ్ ఇండియన్ భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానిదేనని తెలిపారు. అయితే, బాధ్యత, సమగ్రత అనే పదాలు మోదీ ప్రభుత్వానికి తెలియవని చెప్పారు. రాజస్తాన్‌‌‌‌‌‌‌‌లోని ప్రముఖ కోచింగ్ హబ్ కోటాలో బుధవారం విద్యార్థి సదస్సు జరుగనున్న సందర్భంగా ఆయన ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘యువ, జెన్-జీ మిత్రులారా.. నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. దీన్ని మీరు కూడా బలంగా గుర్తుంచుకోవాలి. ప్రతి యువ భారతీయుడి భవిష్యత్తుకు భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. కానీ, మోదీ ప్రభుత్వానికి బాధ్యత, సమగ్రత వంటి పదాలు తెలియవు’’ అని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, ఫీజుల దోపిడీ, ప్రైవేటీకరణ వల్లే దేశంలో నిరుద్యోగ యువత భవిష్యత్తు అంధకారమవుతోందని, ఈ అంశాలన్నింటిపై విద్యార్థులతో క్షుణ్ణంగా చర్చించాలనుకుంటున్నట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు. ‘‘యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే నేను మీకు పిలుపునిస్తున్నాను. దేశంలోని ప్రతి వీధి, పట్టణం, సిటీ నుంచి వస్తున్న ‘విద్యార్థి శబ్దాన్ని’ కోటా వేదికగా బలంగా వినిపిద్దాం” అని పిలుపునిచ్చారు.

నేడు కాంగ్రెస్ విద్యార్థి సదస్సు

పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాల వల్ల నష్టపోయిన విద్యార్థులు, యువతను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విద్యార్థి సదస్సులను నిర్వహిస్తోంది. కోటాలో నిర్వహించనున్న కార్యక్రమం అందులో మొదటిది. బుధవారం జరిగే ఈ సదస్సుకు దాదాపు 10,000 మంది విద్యార్థులను సమీకరించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. పేపర్ లీకేజీలు, పెరిగిపోతున్న పరీక్షల ఖర్చులు, పారదర్శకమైన నియామక ప్రక్రియను చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఈ ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.