ఆర్థిక తుఫాను ముంచుకొస్తోంది..యువత, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం: రాహుల్ గాంధీ

ఆర్థిక తుఫాను ముంచుకొస్తోంది..యువత, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం:  రాహుల్ గాంధీ
  • యువత, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది: రాహుల్ గాంధీ 
  • ప్రధాని తన పొదుపు విజ్ఞప్తిని తానే పాటించడం లేదు 
  • ప్రజలను విదేశాలకు వెళ్లొద్దని చెప్పి.. ఆయనే దేశాలు తిరుగుతున్నారని కామెంట్​

రాయ్‌‌‌‌‌‌‌‌బరేలీ(యూపీ):పొదుపు చేయాలని, విదేశాలకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. తాను మాత్రం వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లారంటూ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశం వైపు ఆర్థిక తుఫాను దూసుకొస్తోందని ఆయన హెచ్చరించారు. ‘దీన్ని ఎవరూ ఆపలేరు. ఇది మన జీవితంలో ఎప్పుడూ అనుభవించని స్థాయిలో ఉంటుంది’ అని చెప్పారు. దీనివల్ల రైతులు, యువత, కార్మికులు, చిన్న వ్యాపారులపైనే తీవ్ర ప్రభావం పడుతుందని.. అదానీ, అంబానీ వంటి బిలియనీర్లకు మోదీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. 

‘అదానీ, అంబానీల కోసం ప్రధాని మోదీ తయారు చేసిన వ్యవస్థ ఇది. ఇలాగే చెక్కుచెదరకుండా ఎక్కువకాలం ఉండదు, కూలిపోతుంది. విచారకరంగా, ఆ నష్టాన్ని మాత్రం సామాన్య ప్రజలు అనుభవిస్తారు. అంబానీ, అదానీలు తమ ప్యాలెస్‌‌‌‌‌‌‌‌లలోనే ఉంటారు. ఆ షాక్ మొత్తాన్ని యువత, ప్రజలు అనుభవిస్తారు’ అని ఆయన అన్నారు. మంగళవారం యూపీలోని తన సొంత లోక్ సభ నియోజకవర్గం రాయ్‌‌‌‌‌‌‌‌బరేలీతోపాటు అమేథీలో రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. అమెరికా యుద్ధంతో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిందని, ఫలితంగా ప్రపంచమంతా చమురు, ఎరువులు, డీజిల్ తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయని అన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చేంత వరకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందన్నారు.

చర్యలు తీసుకోవడం మాని, విదేశాలకు వెళ్తున్నరు

ప్రజలు బంగారం కొనవద్దని, ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని, విదేశీ ప్రయాణాలకు దూరంగా ఉండాలని మోదీ కోరతారని, కానీ.. ఆయన మాత్రం విదేశీ పర్యటనకు బయలుదేరుతారని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘పెట్రోల్ ధరలు పెరగనున్నాయి, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతుంది. అయినా, రాహుల్ గాంధీకి అవగాహన లేదని వారు అంటారు. మేం వారికి చెబుతూనే ఉన్నాం. చర్యలు తీసుకోండి. ప్రజలను, రైతులను రక్షించండని చెప్తున్నాం. కానీ వారికి చేయడానికేమీ లేదు. కొన్నిసార్లు వారు నార్వేకు ఎగురుతారు, తర్వాత జపాన్​కు వెళతారు. ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించారు. ‘కార్మికులు, చిన్న వ్యాపారులను రక్షించడం ప్రారంభించాలని మేం ప్రతిరోజూ ప్రధానిని కోరుతూనే ఉన్నాం.. ఆయనేమో నార్వేకు ఎగిరిపోతారు. అక్కడ ఆయన, సోదరా! అదానీకి సహాయం చేయండి, అంబానీకి సహాయం చేయండని అంటారు’ అని ఎద్దేవా చేశారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే సమస్య 

ప్రధాని మోదీ విధానాలతో అదానీ, అంబానీ మరింత ధనవంతులు అవుతారని, జనం డబ్బు అంతా వారి జేబుల్లోకి వెళ్తుందన్నారు. ముకేశ్ అంబానీ కుటుంబంలో జరిగిన వివాహానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ హాజరయ్యారని, కానీ తాను మాత్రం వెళ్లలేదన్నారు. తాను ప్రజల ఇండ్లల్లో జరిగే పెండ్లిళ్లకు వెళ్లాలని అనుకుంటున్నానని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానమిస్తూ, సమస్య వాహనాలతో కాదు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ఉందన్నారు. ‘చాలా త్వరలోనే ఎరువుల కొరత ఏర్పడబోతోంది. వారు ఏ ప్రపంచంలో జీవిస్తున్నారో, ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని చెబుతున్నారో నాకు తెలియదు’ అని ఆయన అన్నారు.