టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‎కు వెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: గత నెల రోజులుగా క్రికెట్ ఫ్యాన్స్‎ను ఉర్రూతలూగించిన టీ20 వరల్డ్ కప్ 2026 చివరి అంకానికి చేరుకుంది. సెమీస్‎లో ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. 2026, మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న టైటిల్ పోరులో సూర్యకుమార్ సేన న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్లే వారికి ఉత్తర రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. 

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఢిల్లీ నుంచి సబర్మతికి స్పెషల్ ట్రైన్ ప్రకటించింది. ఈ రైలు మార్చి 7వ తేదీ రాత్రి 11:45 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మార్చి 8 మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి చేరుకుంటుంది. ఢిల్లీ కాంట్, గురుగ్రామ్, జైపూర్ గుండా ఈ రైలు వెళ్లనుంది. ఈ రైలు థర్డ్ ఎసీ, సెకండ్ ఎసీ కోచ్‌లతో సహా మొత్తం 19 కోచ్‌లను కలిగి ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ రోజు అహ్మదాబాద్‎కు విమాన టికెట్ల రేట్లు భారీగా పెరగడంతో క్రికెట్ ఫ్యాన్స్ ట్రైన్‎ను ఆశ్రయిస్తున్నారు.  

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ తుది పోరులో చరిత్ర సృష్టించేందుకు టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన సూర్యకుమార్ సేన వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది.

 వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకునేందుకు గట్టి సంకల్పంతో ఇండియన్ టీమ్ ముందుకు సాగుతుంది. అయితే న్యూజిలాండ్‌ జట్టును కూడా తక్కువ అంచనా వేయొద్దు.. అనేక సందర్భాల్లో అండర్‌డాగ్‌గా కనిపించినా ప్రపంచకప్‌లో భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కివీస్ విజయం సాధించింది. అందువల్ల ఫైనల్ పోరు మరింత ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది.