చెరువుల్లో ఇండ్లు.. రోడ్లపై నీళ్లు

చెరువుల్లో ఇండ్లు.. రోడ్లపై నీళ్లు

హైటెక్ సిటీలో మాయమైన చెరువులు

ఆక్రమణలతో ఫీడర్ చానళ్లు అదృశ్యం

చక్కదిద్దడంలో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం

భూగర్భ జలాల కొరతతో తాగునీటికి తిప్పలు

కబ్జాలతో చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. వర్షపు నీరు పోయే మార్గంలేక రహదారులు, నివాస ప్రాంతాలను ముంచెత్తు తోంది. హైటెక్​సిటీలో చెరువుల కబ్జా వల్లనే వానాకాలంలో  రోడ్లే చెరువులను తలపిస్తూ ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నాయి. కుంటలన్నీ మాయం కావడంతో నీటి నిల్వలు తగ్గిపోయి భూగర్భ జలమట్టం కూడా పడి పోతోంది. బోర్లు ఎండిపోయి తాగు నీటి సమస్య తలెత్తుతోంది. ఈ మధ్య ఐటీ కారిడార్​తో పాటు పలుచోట్ల ఏర్పడ్డ ట్రాఫిక్​ జామ్​కు చెరువులు, నాలాల కబ్జాలే కారణమయ్యాయి.

rain effect : lakes covered with buildings in hyderabad

చిన్నపాటి వర్షం వచ్చినా జీహెచ్​ఎంసీ విపత్తుగా భావిస్తోంది. అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బలగాలను మోహరించాల్సి వస్తోంది. చెరువులు, కాల్వలు కబ్జా కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జలవనరులను కాపాడడంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డులు విఫలమయ్యాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో ఒకప్పుడు ఉన్న చెరువులు ప్రస్తుతం ఉనికిలో లేవు. ఎక్కడికక్కడ భవన నిర్మాణాలు పెరిగిపోవడంతో ఫీడర్ చానళ్లు మూసుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లోనే అక్రమ కట్టడాలు వెలిశాయి. బ‌ర్లకుంట‌, తమ్మిడి కుంట, పటేల్ చెరువు, మల్కం చెరువు, కాజాగూడ చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. వీటి ఎగువ ప్రాంతంలో యథేచ్చగా నిర్మాణాలు చేపట్టారు. తమ్మిడికుంట చెరువులోనే ప్రైవేటు సంస్థలు, ఈవెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

మల్కంచెరువు మధ్యలోనే అభివృద్ధి, సుందరీకరణ పేరిట భారీ నిర్మాణాలు చేపట్టారు. ఓ నిర్మాణ సంస్థ తమ వ్యాపార ప్రయోజనాల కోసం చెరువును విధ్వంసం చేసింది. ఇలా ఒకటి, రెండు కాదు.. సిటీలోని ఏ చెరువు పరిస్థితి చూసినా ఇలాగే ఉంది. చెరువుల ఆక్రమణలు, ఫీడర్ చానళ్ల అన్యాక్రాంతంతో రోడ్లమీద నీరు పారుతోంది. దీంతో చిన్నపాటి వర్షానికే శిల్పారామం, హై-టెక్‌సిటీ, గ‌చ్చిబౌలి చౌర‌స్తా, రాడిస‌న్ హోట‌ల్, బ‌యోడైవ‌ర్సిటీ జంక్షన్‌, సుదర్శన్‌న‌గ‌ర్‌, గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్‌, ఐకియా, కొండాపూర్‌, దుర్గంచెరువు వంటి ఏరియాలు నీట మునుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారీ భవనాలు నిర్మించి ఇదే అభివృద్ధి అనుకుంటున్న ప్రభుత్వం, అధికారులు ప్రకృతి విధ్వంసాన్ని పట్టించుకోవడం లేదు.

rain effect : lakes covered with buildings in hyderabad

వాన నీటిని సద్వినియోగం చేసుకోలేక..

భారీ వర్షాలను భూగర్భ జలాలుగా మార్చుకోవడంలో విఫలం కావడంతో సిటీకి తాగునీటి సమస్య తలెత్తుతోంది. గ్రావిటీ ద్వారా చెరువుల్లోకి నీరు వెళ్లక పోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. సిటీ నీటి అవసరాలు తీర్చుకునేందుకు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న  గోదావరి, 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నదుల నుంచి సరఫరా చేసుకోవాల్సి వస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి సహజసిద్ధమైన మార్గాల్లో నీరు దిగువకు ప్రవహిస్తుంది. కానీ చెరువులు, కుంటలు, ఫీడర్​చానల్స్​ధ్వంసం కావడంతో నీళ్లు రోడ్లపై పారుతున్నాయి. డ్రెయిన్లు ఏర్పాటుచేసినా తగినంత నీరు వెళ్లేలా లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. మాదాపూర్‌, గ‌చ్చిబౌలి ఏరియాల్లో గంట‌కు రెండు సెంటీమీటర్ల వ‌ర్షపాతాన్ని మాత్రమే త‌ట్టుకునే డ్రెయిన్స్ ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గర ఉన్న డ్రెయిన్‌లో ట్రాన్స్‌కో లైన్లు వేయడంతో నీరు పారే దారిలేదు. రాడిస‌న్ వ‌ద్ద డ్రెయిన్‌లో ప్రైవేట్ కేబుళ్లు వేయ‌డంతో ప్రవాహానికి అడ్డంగా మారి ట్రాఫిక్​ అంతరాయం కలుగుతోంది.