- వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలు
- కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. హైదరాబాద్ సిటీలో దంచికొట్టిన వాన
- నేడు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- జారీ చేసిన వాతావరణ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు, హైదరాబాద్‌లో మంగళవారం భారీ వాన కురిసింది. బుధవారం కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. మిగతా రాష్ట్రమంతా మోస్తరు వర్షాలు పడే చాన్స్ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి.
అలాగే.. మంగళవారం అత్యధికంగా కామారెడ్డి జిల్లా మఖ్దూంపూర్లో 7.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అదే జిల్లా జుక్కల్‌లో 6.5 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌లో 6, తాంసిలో 5.9, కామరెడ్డి జిల్లా పిట్లంలో 5.8, యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపూర్‌లో 4.3, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 4.1, మహబూబాబాద్జిల్లా కొమ్ములవంచలో 4.1, సంగారెడ్డి జిల్లా దిగ్వాల్లో 4, వరంగల్జిల్లా చెన్నారావుపేటలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని అన్ని సర్కిళ్లలోనూ వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా ముషీరాబాద్‌లో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తార్నాకలో 5, బన్సీలాల్‌పేటలో 4.6, ఓయూలో 4, బోయిన్‌పల్లిలో 4, రహ్మత్‌నగర్‌లో 3.9, తుర్కయంజాల్‌లో 3.8, చందానగర్‌లో 3.7, సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
