టీజీహెచ్‌‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజభాను చంద్రప్రకాశ్

టీజీహెచ్‌‌ఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజభాను చంద్రప్రకాశ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ హెడ్‌‌మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్‌‌ఎంఏ) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శిగా జి. హేమచంద్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని కాచిగూడలో ఉన్న స్టేట్ టీచర్స్ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ హెడ్‌‌మాస్టర్స్ అసోసియేషన్, గెజిటెడ్ హెడ్‌‌మాస్టర్స్ సంఘం విలీన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు సంఘాలు టీజీహెచ్‌‌ఎంఏ పేరుతో ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించాయి.గౌరవ అధ్యక్షుడిగా పి. మురళికృష్ణ, ముఖ్య సలహాదారుగా డాక్టర్ పర్వతి సత్యనారాయణను ఎన్నుకున్నారు.

రాజభాను చంద్రప్రకాశ్ మాట్లాడుతూ.. అన్ని మేనేజ్‌‌మెంట్లలో పనిచేస్తున్న టీచర్లు, హెడ్‌‌మాస్టర్ల ఐక్యత కోసం కృషి చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని తెలిపారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అకడమిక్ ఎక్సలెన్స్, సమాన అభివృద్ధిని సాధించడం కోసం సంఘం కృషి చేస్తుందని కార్యవర్గం పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను జాక్టో (జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్) చైర్మన్ సదానందం, సెక్రటరీ జనరల్ కే కృష్ణుడు పర్యవేక్షించారు. టీజీహెచ్‌‌ఎంఏ జాక్టోలో కొనసాగుతూ, ఉపాధ్యాయుల వృత్తిపరమైన అవసరాలను తీర్చడంలో, విధాన నిర్ణయాలలో సమన్వయంతో పనిచేస్తుందని వెల్లడించారు.