రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక స్మగ్లర్ల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. అనుమతులు లేకుండా ఇసుక స్మగ్లింగ్ చేస్తూ అడ్డుకోబోయిన వారిపై దాడులకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో చంపేందుకు కూడా వెనకాడటం లేదు. బుధవారం (ఏప్రిల్ 15) ఎమ్మార్వోపై జరిగిన దాడే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
జిల్లా కేంద్రంలో ఇసుక స్మగ్లర్లు MRO మహేశ్‌పై ట్రాక్టర్ తో దాడికి దిగటం జిల్లాలో కలకలం రేపింది. అనుమతులు లేకుండా ట్రాక్టర్ తో ఇసుక స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లను ఎమ్మార్వో అడ్డుకోబోయారు. దీంతో తప్పించుకునే క్రమంలో ఎమ్మార్వో మహేష్ పైకి దూసుకెళ్లింది ట్రాక్టర్. ఇసుక ట్రాక్టర్ నుంచి తృటిలో తప్పించుకుని ఎమ్మార్వో ప్రాణాలతో బయటపడ్డారు .
అడ్డుకోబోయిన తనను ట్రాక్టర్ తో దాడి చేసే ప్రయత్నం చేసిన వారిపై ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

