- వీరంతా బంగ్లాదేశ్ నుంచి మలేషియాకు వెళ్తున్నట్టు సమాచారం
- పడవలో పరిమితికి మించి ఎక్కడం, బలమైన గాలులే ప్రమాదానికి కారణం
ఢాకా: అండమాన్ సముద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశీయులతో కలిసి మలేషియా వెళ్తున్న ఓ పడవ మునిగింది. దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వీరందరూ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లా టెక్నాఫ్ నుంచి అక్రమంగా మలేషియాకు వెళ్తున్నట్లు సమాచారం. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, బలమైన గాలుల వల్ల పడవ నియంత్రణ కోల్పోయి మునిగిపోయిందని ఐక్యరాజ్యసమితి సంస్థలు వెల్లడించాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌక సిబ్బంది సముద్రంలో కొట్టుకుపోతున్న 9 మందిని రక్షించారు. వారిలో 8 మంది పురుషులు, ఒక మహిళ ఉన్నారు. వీరిని టెక్నాఫ్ పోలీసులకు అప్పగించారు. యూన్హెచ్ఆర్సీ, ఐఓఎం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశాయి: మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింస కారణంగా రోహింగ్యాలు తమ దేశానికి తిరిగి వెళ్లలేకపోతున్నారు. శరణార్థుల శిబిరాల్లో పరిమిత సాయం, విద్య, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల మెరుగైన జీవితం కోసం దళారుల మాటలు నమ్మి ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. బంగ్లాదేశ్‌లో తలదాచుకుంటున్న 10 లక్షల మందికి పైగా రోహింగ్యా శరణార్థులకు సాయం అందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చింది. కాగా పడవ ఎప్పుడు మునిగింది, గాలింపు చర్యల పరిస్థితిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

