V6 News

హైదరాబాద్‌‌ లో నిజాం నగల పేరుతో వ్యాపార వేత్తకు 50 కోట్లు టోకరా

హైదరాబాద్‌‌ లో నిజాం నగల పేరుతో వ్యాపార వేత్తకు 50 కోట్లు టోకరా
  •     ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేశ్ గుప్తాపై కేసు

బషీర్​బాగ్, వెలుగు: హైదరాబాద్‌‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి నిజాం కాలం నాటి బంగారు ఆభరణాల పేరుతో వ్యాపారి నుంచి రూ. 50 కోట్లు కాజేశాడు.సిటీకి చెందిన ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుకేశ్ గుప్తా, అతని అనుచరుడు జాకీర్ ఉస్మాన్‌‌ కలిసి బంజారాహిల్స్​కు చెందిన వ్యాపారవేత్త రాజేశ్ అగర్వాల్​ను గోల్డ్ పేరుతో ట్రాప్​లోకి లాగారు. 'కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్' వారి వద్ద నిజాం కాలానికి చెందిన ఐదు అత్యంత విలువైన బంగారు ఆభరణాల పెట్టెలు ప్రభుత్వ కస్టడీలో ఉన్నాయని నిందితులు నమ్మబలికారు.

వాటిని విడిపించే ప్రక్రియలో ఆర్థికంగా సహాయం చేస్తే, ఆ తర్వాత వచ్చే భారీ లాభాల్లో పెద్ద వాటా ఇస్తామని రాజేశ్ కు ఆశ పెట్టారు. నిందితుల మాటలు నమ్మిన రాజేశ్ అగర్వాల్..వారితో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2016 నుంచి వివిధ దఫాలుగా మొత్తం రూ. 50 కోట్ల 80 లక్షలను నిందితులకు అందజేశారు. 

అయితే, ఏండ్లు గడుస్తున్నా ఆభరణాల పెట్టెల ఊసే లేకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. నిందితులను నిలదీయగా వారు కాలయాపన చేస్తూ, డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అగర్వాల్ బుధవారం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుడి ఫిర్యాదు మేరకు సుకేశ్ గుప్తా, జాకీర్ ఉస్మాన్‌‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అసలు ప్రభుత్వ విభాగాల్లో అటువంటి ఆభరణాల పెట్టెలు ఉన్నాయా? లేక కేవలం మోసం చేసేందుకే నిజాం పేరును వాడుకున్నారా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.