- ఇతను డ్రగ్స్ ఓవర్ డోస్‌తో గతేడాది దుబాయిలో మృతి
- కేదార్ అకౌంట్‌కు రూ.25 లక్షలు పంపిన పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు
- కస్టడీ పిటిషన్‌లో కీలక వివరాలు వెల్లడించిన సిట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఫిల్మ్ ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ పేరు తెరమీదికి వచ్చింది. ఆయన బ్యాంక్అకౌంట్లకు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి అకౌంట్ల ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు సిట్‌దర్యాప్తులో తేలింది.
ప్రధానంగా రితేశ్‌రెడ్డి అకౌంట్ నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, బాబిలోన్ పబ్ నిర్వాహకుడు అర్జున్‌రెడ్డి, శిరీష్ సహా మరికొంత మందితో రోహిత్‌రెడ్డి బ్రదర్స్‌కు డ్రగ్స్ సంబంధిత ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌లో వివరాలు వెల్లడించారు.
అంత డబ్బు ఎందుకు పంపారు?
కస్టడీ విచారణలో సేకరించిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా సిట్దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి బ్యాంక్ అకౌంట్లతో లింకైన అనుమానిత వ్యక్తులకు పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది. గతేడాది ఫిబ్రవరి 24న దుబాయిలో మృతి చెందిన కేదార్‌తో రోహిత్‌రెడ్డికి ఉన్న లింకులు ఏంటనే కోణంలో ఆధారాలు సేకరిస్తోంది.
ఇంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి గల కారణాలపై సిట్దృష్టి సారించింది. కాగా, కేదార్ మృతి చెందిన రోజు అదే ఫ్లాట్‌లో తెలంగాణకు చెందిన ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బస చేసినట్లు తెలిసింది. ఈ ముగ్గురిలో రోహిత్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సిట్అధికారులు కేదార్ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలిసింది.

