- ఏటా బడ్జెట్ లో రూ.25 కోట్ల వరకు కేటాయింపు
- చాలాచోట్లా సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు
- కనీస సదుపాయాలు లేక జనాలకు అవస్థలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీన గ్రామాల అభివృద్ధి ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది. గ్రేటర్ లో విలీనమై ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ చాలాచోట్లా రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కాగా, బడ్జెట్ లో విలీన గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు సగం కూడా ఖర్చు చేయడం లేదు. ఏటా బడ్జెట్ లో రూ.20 కోట్లకుపైగా నిధులు కేటాయిస్తున్నా పూర్తిస్థాయిలో రిలీజ్ చేయకపోవడంతో డెవలప్ మెంట్ కుంటుపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ తీసుకురావాల్సిన కార్పొరేటర్లు నిర్లక్ష్యం వహిస్తుండటం వల్లే గ్రామాల్లో అభివృద్ధి అంతగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
3 లక్షల జనాభా.. అరకొర నిధులు
గతంలో స్పెషల్ క్లాస్ మున్సిపాలిటీగా ఉన్న వరంగల్ 2005లో మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడింది. ఆ తర్వాత 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ గా అప్ గ్రేడ్ చేసింది. ఇందుకు వరంగల్ చుట్టూ ఉన్న 42 గ్రామాలను విలీనం చేస్తూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. గ్రేటర్ పరిధిలో 66 డివిజన్లు ఉండగా, దాదాపు 12 లక్షల జనాభా ఉంది. అందులో విలీన గ్రామాల్లోనే సుమారు 3 లక్షల వరకు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం బల్దియా బడ్జెట్ లో 1/3 నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ తప్పనిసరి వ్యయం, నిర్వహణ ఖర్చుల సాకు చూపి ఏటా విలీన గ్రామాలకు అరకొర నిధులు కేటాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కార్పొరేటర్లు చొరవ లేకనే..
ప్రతిసారి విలీనగ్రామాలకు అరకొరగానే బడ్జెట్ పెడుతున్నా ఆ నిధులను గ్రామాలకు రాబట్టడంలో కార్పొరేటర్లు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. దీంతోనే చాలాచోట్లా రోడ్లు సరిగా లేక ఇబ్బందులు ఎదురవుతుంటే, ఇంకొన్నిచోట్ల డ్రైనేజీలు లేక జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది. అత్యధిక విలీన గ్రామాల్లో ఇప్పటికీ శ్మశాన వాటికలు సరిగా లేవు. దీంతో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే చెరువు గట్లు, ప్రైవేటు స్థలాల్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. హసన్ పర్తి లాంటి మేజర్ సెంటర్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
ఇక్కడ ఉమ్మడి శ్మశాన వాటిక నిర్మాణానికి గతంలో ప్రపోజల్ పెట్టినా ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. నిరూప్ నగర్ తండా నుంచి సుబ్బయ్యపల్లి, సోమిడి రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయి రాకపోకలు సాగించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దేవన్నపేట లాంటి మేజర్ గ్రామానికి గుంతల రోడ్డు గతైంది. ఇలా ఒక్కోచోట ఒక్కో సమస్య వేధిస్తుండగా, కార్పొరేటర్లు గ్రేటర్ బడ్జెట్ ను సక్రమంగా వినియోగించి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఏటా రూ.25 కోట్ల గ్రాంట్.. సగమే ఖర్చు
ప్రతి ఏడాది బడ్జెట్ లో విలీన గ్రామాలు, స్లమ్ ఏరియాల అభివృద్ధి కోసమని సగటున రూ.25 కోట్ల వరకు కేటాయిస్తున్నారు. ఇలా 2024-25 లో మొత్తం రూ.650 కోట్ల బడ్జెట్ పెట్టగా, అందులో దాదాపు రూ.20 కోట్లు విలీన గ్రామాలు, స్లమ్ ఏరియాల కోసం కేటాయించారు. కానీ అందులో రూ.14.93 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2025-26 లో మెర్జ్ విలేజెస్ డెవలప్ మెంట్ కోసం రూ.24.77 కోట్లు కేటాయించి, అందులో రూ.11.10 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. కాగా, ఈ ఏడాది బడ్జెట్ లో రూ.25.43 కోట్లు పెట్టగా, అందులో ఏ మేరకు ఖర్చు చేస్తారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

